- సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి
- రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే చాన్స్
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 'రైతు పండుగ' ముగింపు కార్యక్రమానికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో రైతులనుద్దేశించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా -రైతుభరోసా, పెండింగ్రుణమాఫీపై ప్రకటన చేసే చాన్స్ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
కాగా, సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 'రైతు పండుగ'లో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెళకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తున్నది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏయే స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది.
ఈ మేరకు సీఎం కూడా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు. వారి సూచనలు, సలహాలను తీసుకొని రానున్న నాలుగేండ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటిస్తారని అధికారులు చెప్తున్నారు. శుక్రవారం సాయంత్రం మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ డి.జానకి సభా స్థలిని, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
ఎలాంటి ఘటనలు జరగకుండా భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్ మహబూబ్నగర్వెళ్లే వాహనాలను మహబూబ్నగర్బైపాస్ రోడ్డు నుంచి పిస్తా హౌస్మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే అమిస్తాపూర్వద్ద, భూత్పూర్వద్ద సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.