- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కూ హైకమాండ్ పిలుపు
- పీసీసీ చీఫ్ నియామకం, మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు
- రాహుల్ వరంగల్ సభ, రాజీవ్ విగ్రహావిష్కరణ తేదీలూ ఖరారయ్యే చాన్స్
హైదరాబాద్, వెలుగు: హైకమాండ్ పిలుపుతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ బాట పట్టారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్దీపాదాస్ మున్షీ శుక్రవారం వెళ్లనున్నారు. వీరు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నట్టు సమాచారం.
గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో స్పష్టత వస్తుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ రేసులో బీసీ కోటాలో మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీ (లంబాడ) నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం ఎమ్మార్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడంతో పీసీసీ చీఫ్ పదవి మాదిగలకు ఇచ్చే అంశంపై పార్టీలో ప్రచారం సాగింది.
అయితే, ఆయన మాత్రం ఎస్సీ వర్గీకరణ అమలుపైనే సీఎంతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి పీసీసీ చీఫ్ నియామకంపై శుక్రవారం క్లారిటీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, కేబినెట్ లో ప్రాతినిథ్యం లేని జిల్లాలతో పాటు సామాజికవర్గాల ఆధారంగానే మంత్రి పదవులను భర్తీ చేస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.
అలాగే, వరంగల్ లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ ను ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియెట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీ కూడా ఈ భేటీలో ఖరారు కానుందని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారంటీలపై పార్టీ పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు ఈ భేటీలో వివరించనున్నట్టు సమాచారం.