ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం.. జలదోపిడీకి టెలిమెట్రీతోనే అడ్డుకట్ట: సీఎం రేవంత్

ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం.. జలదోపిడీకి టెలిమెట్రీతోనే అడ్డుకట్ట: సీఎం రేవంత్
  • పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే
  • జలదోపిడీకి టెలిమెట్రీతోనే అడ్డుకట్ట: సీఎం రేవంత్
  • ఏపీ తీరుపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి
  • టెలిమెట్రీ కోసం అవసరమైతే తొలుత ఖర్చు మనమే భరిద్దాం
  • దీనిపై కేఆర్​ఎంబీకి లేఖ రాయాలని రాహుల్​ బొజ్జాకు ఆదేశం
  • శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలాల వినియోగంపై  అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లకు సూచనలు
  • ఏపీ జలదోపిడీ, ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వనిదేనని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే అధికారం కేంద్ర జల సంఘంపైనే ఉందని తెలిపారు. కోటాకు మించి నీటిని ఆంధ్రప్రదేశ్​ తరలించుకుపోకుండా అడ్డుకట్ట వేయాలంటే టెలిమెట్రీ ఒక్కటే పరిష్కారమని ఆయన అన్నారు. 

టెలిమెట్రీ ఏర్పాటుకు అవసరమైన నిధులను తొలుత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, దీనిపై కేఆర్​ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జాను సీఎం రేవంత్​ ఆదేశించారు. అయితే, టెలిమెట్రీ నిధులను చెల్లించేందుకు ఏపీ ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

కోటాకు మించి నీటి తరలించుకుపోతున్న ఏపీ తీరును ఎండగడుదామని, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీ జలదోపిడీ, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటల సాగు అవసరాలపై సోమవారం సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ అధికారులు పాల్గొన్నారు. పదేండ్లుగా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలపై సీఎం ఆరా తీసినట్టు తెలిసింది. ఏపీ జలదోపిడీపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించినట్టు సమాచారం. 

పంటలకు ఇబ్బందులుండొద్దు
వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. ఎండలు పెరిగే కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులపై ముందుగానే జాగ్రత్త పడాలని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలకు సాగునీటి విషయంలో ఇబ్బందులు ఉండొద్దన్నారు. రాబోయే మూడు నెలలు అలర్ట్​గా ఉండాలని ఆయన ఆదేశించారు. 

అధికారులు గ్రౌండ్​లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అందుకు తగినట్టు పరిష్కారాలపై ఆలోచన చేయాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​, ఎస్సారెస్పీ సహా ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఆరా తీశారు. నీటి నిల్వలకు తగ్గట్టు నీటిని సమర్థంగా వాడుకోవాలన్నారు.

సాగునీటికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో తాగునీటికి డిమాండ్​ భారీగా పెరుగుతుందన్నారు. సాగు, తాగు నీటి సరఫరా విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపించాలని, ప్రాజెక్టుల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళిలకు తయారు చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, కాల్వల ద్వారా విడుదల చేస్తున్న జలాలు, ఆయకట్టులో పంటల పరిస్థితిపై కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. దీనిపై ఎజెండాను సిద్ధం చేసి, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించి, అందుకు తగ్గట్టు  ఆదేశాలివ్వాలని సీఎస్​ శాంతి కుమారిని సీఎం రేవంత్​ ఆదేశించారు.