
నారాయణపేట, వెలుగు: ఈనెల 21న వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, పర్యటనకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కళాశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు.
21న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తా లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అనంతరం అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కళాశాలలో వంద బెడ్ల ఎంసీహెచ్, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సింగారం చౌరస్తాలో గల పెట్రోల్ బంక్, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.