
- ఉగాది రోజు సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూర్యాపేట, వెలుగు : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఉగాది సందర్భంగా ఈ నెల 30న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సన్నబియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి ఇప్పటికే రేషన్‌షాపులకు తరలించారు.
ముందు సభ.. తర్వాత బియ్యం పంపిణీ
హుజూర్‌నగర్‌లో పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. సీఎం రేవంత్‌రెడ్డి 30న సాయంత్రం 5.45 గంటలకు ఫణిగిరిగట్టుపై గల హెలిప్యాడ్ వద్ద దిగిన అనంతరం మోడల్ కాలనీని పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభా ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. అనంతరం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు.
సభా ప్రాంగణాన్ని పరిశీలించినమంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ తేజస్‌నందులాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, ఇతర ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో జరిగిన హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రేషన్ షాపుల్లో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని కేవలం 5 శాతం మంది కూడా తినడం లేదని, దీంతో ఈ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధరకు సన్నొడ్లు కొని వాటిని మిల్లింగ్ చేయించి పేదలకు అందిస్తున్నామని చెప్పారు.