- రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
- పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలది కీలకపాత్ర
- ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
- 4 స్కీమ్స్‌కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం
- హాజరైన మంత్రులు వెంకట్‌రెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా 4 సంక్షేమ పథకాల అమలు కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్అమలుతోపాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ప్రకటించారు. సోమవారం ఈ 4 స్కీమ్స్‌కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు రూ.22 వేల 500 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలు 20 రోజులు ఉపాధి హామీ పని చేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయం అందజేస్తామని తెలిపారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామ సభలో పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ కమిటీల సభ్యులను భాగస్వామ్యం చేయాలని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం తర్వాతే మంజూరు ప్రోసిడింగ్స్ అందజేయాలని అన్నారు. ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది.. ఎంత మందికి రైతు భరోసా వస్తుంది.. బోనస్ వచ్చిన రైతుల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రూ. 66.33 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే 2,400లకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని అన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు: మంత్రి వెంకట్‌రెడ్డి
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరడం ఎంత ముఖ్యమో.. అనర్హులకు అందకుండా చూడడం కూడా చాలా కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భూసేకరణ జరిగిన, రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కాకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని తెలిపారు. గత పాలకుల హయాంలో రేషన్ కార్డులు అందలేదని, అర్హులందరికీ ప్రస్తుతం రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రాబోయే 10 రోజులు అధికారులు కష్టపడి గ్రామాల్లో తిరుగుతూ అర్హులను ఎంపిక చేయాలని, ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాలు అమలు కావాలని సూచించారు.
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో కొత్త సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. రేషన్ కోసం ప్రతి ఏటా సన్న బియ్యం మీద రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడికి సహాయం అందేలా చూడాలని అన్నారు. లేఔట్, నాలా, భూ సేకరణ, పరిశ్రమలు, మైనింగ్ భూముల సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, గ్రామ శాటిలైట్ మ్యాప్ వాడుతూ పారదర్శకంగా అర్హుల ఎంపిక ఉండాలని అన్నారు. పంట వేసినా, వేయక పోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని అన్నారు.
కుల, మతాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి
గిరిజన ప్రాంతాల్లో కుల, మతాలకతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 4 లక్షల 50 వేల ఇండ్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని మంజూరు అవుతాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు డేటా చాలా కీలకమని, అధికారులు వివరాలు సరిగ్గా నమోదు చేస్తేనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు, ఇతరులకు బ్యాంకుల్లో రుణాలు కూడా అందడం లేదని, దీనిని పరిష్కరించాలని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కోరారు.
గతంలో దళిత బంధు లాంటి పథకాలు పొందిన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబ శివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, రాందాస్ నాయక్, డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీవో రాహుల్, ఖమ్మం సీపీ సునీల్ దత్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.