రూ.500 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్​

  • గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మతో కలిసి ప్రారంభించిన సీఎం
  • ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేసే బాధ్యత సర్కారుదే: రేవంత్​ 
  • ప్రతి జిల్లా కలెక్టరేట్లలో అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • అన్నిరంగాల్లో మహిళా సంఘాలు ముందున్నాయి: గవర్నర్​

హైదరాబాద్, వెలుగు:  మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.500 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్​ను  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.   ఇందిరా మహిళా శక్తి బజార్​ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు ఈ బజార్​ను తిలకించే విధంగా వస్తువులు తయారు చేసి, విక్రయించాలని సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ లోని శిల్పారామం పక్కన ఇందిర మహిళా శక్తి బజార్ ను గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ తో కలిసి సీఎం రేవంత్​ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో 65 లక్షల మంది సభ్యులను కోటికి పెంచి,  ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.  మహిళలను సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో భాగస్వాములను చేస్తున్నామని,  అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించామని,  ఆర్టీసీ అద్దె బస్సుల బాధ్యత కూడా వారికే ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం  కల్పించి, ప్రభుత్వపరంగా రూ. 4 వేల కోట్లు ఆ సంస్థకు చెల్లించామని చెప్పారు. డిసెంబర్ 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.  

ప్రతి జిల్లా కలెక్టరేట్ లో అమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయడంతోపాటు మహిళలు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలో  ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వపరంగా సబ్సిడీలు అందిస్తామని సీఎం చెప్పారు. ఈ  కార్యక్రమంలో గవర్నర్ సతీమణి దీపా దేవ్ వర్మ,  మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్​ శాంతి కుమారి, సెర్ప్​ సీఈవో డి. దివ్య, రంగారెడ్డి  కలెక్టర్ సి. నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్,  తదితరులు పాల్గొన్నారు. 

మహిళా సంఘాలకు సముచిత స్థానం కల్పించడం భేష్​: గవర్నర్​

రాష్ట్రంలోని మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం గర్వకారణమని గవర్నర్​ జిష్టుదేవ్​ వర్మ  అన్నారు.  మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వారికి అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించడం అభినందనీయమని ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇప్పటి వరకు 65 లక్షల మంది ఎస్​హెచ్​జీ మహిళలు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది, వారి కుటుంబ అభివృద్ధిలో పాలు పంచుకోవడం శుభ పరిణామని చెప్పారు.  ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో గవర్నర్ దంపతులు కొద్దిసేపు ముచ్చటించారు.  

ప్రభుత్వ ప్రోత్సాహంతో తమ వ్యాపారం జోరుగా సాగుతున్నదని, తాము మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నామని  మహిళలు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామని మహిళలు పేర్కొనగా.. గవర్నర్ ప్రత్యేకంగా వారిని అభినందించారు. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి మహిళా సమాఖ్యల అవసరాన్ని వివరించి, ఎస్​హెచ్​జీలను ఏర్పాటు చేయించామని  చెప్పడంతో గవర్నర్ సతీమణి కూడా మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు.