మార్చి 16న స్టేషన్​ఘన్​పూర్​కు సీఎం రాక

 మార్చి 16న స్టేషన్​ఘన్​పూర్​కు సీఎం రాక
  • రూ.629.62 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • శివునిపల్లి వద్ద బహిరంగ సభ

జనగామ/ స్టేషన్​ ఘన్​పూర్,​ వెలుగు : ఈ నెల 16న సీఎం రేవంత్​రెడ్డి స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసినరూ.629.62 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఘన్​పూర్​ శివారులోని శివునిపల్లి వద్ద బహిరంగ సభ నిర్వహించనుండడంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

రూ.629.62 కోట్లతో పనులు ప్రారంభం..

స్టేషన్​ఘన్​పూర్ లో పలు అభివృద్ధి పనులకు గానూ రాష్ర్ట ప్రభుత్వం 629.62 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాంగానే జఫర్​ఘడ్​ మండలం కోనాయిచలంలో రూ.200 కోట్లతో యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​స్కూల్​కాంప్లెక్స్​ను నిర్మించనున్నారు. నియోజకవర్గ కేంద్రంలో రూ.5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, రూ.కోటితో టీజీ ఎన్​పీడీసీఎల్  డివిజనల్​ ఆఫీస్, కుర్చపల్లి, సాగరం, కొండాపూర్​లలో 33/11 కేవీ సబ్​స్టేషన్లు, రూ.10 కోట్లతో వేలేరు మండలం పీచరలో 220/132 కేవీ సబ్​ స్టేషన్, రూ.2 కోట్లతో బంజారా భవన్, ఎస్డీఎఫ్, ఈజీఎస్​కింద రోడ్ల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరయ్యాయి.

స్టేషన్ ఘన్​పూర్​లో రూ.45.50 కోట్లతో  100 పడకల ఆస్పత్రి భవనం, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్​డివిజనల్​ఆఫీస్​కాంప్లెక్స్, రూ.148.76 కోట్లతో ఘన్​పూర్​ నుంచి నవాబుపేట రిజర్వాయర్​వరకు మెయిన్​ కెనాల్​ సీసీ లైనింగ్​నిర్మాణ పనులు చేపట్టనున్నారు.  పంచాయతీ రాజ్​శాఖ ఆధ్యర్యంలో సీసీ రోడ్ల కోసం రూ.53 కోట్లు, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ కాగా, స్టేషన్​ ఘన్​పూర్​కు మరో 1500ల ఇండ్లు, ఆయిల్​సీడ్​ కలెక్షన్​ సెంటర్​ మంజూరు కాగా శంకుస్థాపన చేయనున్నారు. 

అదేవిధంగా జనగామ జిల్లాలోని మహిళా సంఘాలకు 7 మహిళా శక్తి ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా, వాటిని సభ్యురాళ్లకు సీఎం ఇక్కడి నుంచే అందించనున్నారు. సీఎం పర్యటన నేపత్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​, అడిషనల్​ కలెక్టర్లు రోహిత్​సింగ్​, పింకేష్​కుమార్​, డీసీపీ రాజమహేంద్ర నాయక్​, ఇతర ప్రభుత్వ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.