
- అటెండ్ కానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు
హైదరాబాద్, వెలుగు: కులగణన అంశంపై శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలో బేగంపేట ప్రజా భవన్ లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అటెండ్ కానున్నారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు హాజరవుతారు. కులగణనలో గతంలో వివరాలు ఇవ్వని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అయితే, గత 5 రోజుల నుంచి వివరాలు ఇచ్చేందుకు ఎక్కువ మంది రావటం లేదని, స్పందన అంతంత మాత్రమే ఉన్నట్లు ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.
సుమారు మూడున్నర లక్షల కుటుంబాలు ఇంకా వివరాలు ఇవ్వాల్సి ఉన్నందున, వీరికి అవగాహన కల్పించాలని సీఎం, పీసీసీ చీఫ్ ఆదేశించనున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. మరో వైపు.. వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అదే టైమ్లో రిజర్వేషన్లు పెంచేందుకు చొరవ చూపాలని బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకువచ్చే అంశంపై సీఎం, పీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ మీటింగ్కు తమను ఆహ్వానించలేదని, సమాచారం లేదని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు.
23న నాటి పీసీసీ సమావేశం వాయిదా
ఈ నెల 23న గాంధీ భవన్లో జరగాల్సిన పీసీసీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మీటింగ్ ను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పీసీసీ సమావేశం నిర్వహిస్తామని.. తేదీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. సమావేశం వాయిదాతో పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది.