
- మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కల్యాణం
- భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
- రేపు పట్టాభిషేకానికి హాజరుకానున్న గవర్నర్
భద్రాచలం, వెలుగు: సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. రాములోరి పెండ్లిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇప్పటికే భద్రాచలం చేరుకుంటున్నారు.
తానీషా శాసనాన్ని అనుసరించి స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం రేవంత్‌రెడ్డి సమర్పించనున్నారు. 7న జరిగే పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. కాగా, స్వామి వారి కల్యాణం అనంతరం ఐటీడీఏలో నిర్మించిన ట్రైబల్ మ్యూజియంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయనున్నారు.
చలువ పందిళ్లు.. పొగమంచు యంత్రాలు
రాములోరి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. కల్యాణం రోజున భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. కల్యాణం జరిగే స్టేడియంలో ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఎండల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు వేయడంతో పాటు పొగమంచు యంత్రాలను అమర్చారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 ఫాగర్స్ బిగించారు. సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా 32 వేల మంది వీక్షించేలా స్టేడియంలో 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు.
ఆలయం బయట ఎల్‌ఈడీ టీవీల ద్వారా కూడా భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం రూ.4 కోట్ల ఖర్చుతో భక్తుల కోసం సౌలతులు కల్పిస్తున్నారు. భక్తులకు తాత్కాలిక వసతి, 250 కిలోల ఉచిత తలంబ్రాలు, 2.50 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు పోస్టల్, ఆర్టీసీ ద్వారా ఇంటింటికీ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. 80 ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉచిత తలంబ్రాలు, 26 కౌంటర్లలో ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు.
ఆలయం చుట్టూ, స్టేడియం, టౌన్‌లో తాగునీరు కోసం 200కు పైగా నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. వాహనాలకు పార్కింగ్సదుపాయం కల్పించారు. తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్టణాన్ని 15 జోన్లుగా విభజించి 300 మంది సిబ్బందితో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు.
10 వైద్య శిబిరాలు, 5 అంబులెన్సులు, ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. కాగా, రాములోరి కల్యాణానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 300 బస్సులు నడుపుతున్నది. బస్టాండ్ నుంచి ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. భద్రాచలం నుంచి పర్ణశాలకు
ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు నడపనుంది.
భారీ బందోబస్తు..
సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,800 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో వీఐపీలకు భద్రత పెంచారు. ఓవైపు చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ఆపరేషన్ చేస్తూనే, మరోవైపు భద్రాచలంలో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్సింగ్కుమార్పర్యవేక్షణలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పోలీసులు టెంపుల్ఏరియాలో పహారా కాస్తున్నారు. భద్రాచలం పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు.
నాడు మాస్టర్ ప్లాన్ పేరుతో కేసీఆర్ హడావుడి..
గత బీఆర్ఎస్ సర్కార్ తానీషా శాసనానికి తూట్లు పొడిచింది. పదేండ్ల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే (2015, 2016) రాములోరి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. ఒకసారి అతని మనుమడు తలంబ్రాలు తీసుకురావడం వివాదాస్పదమైంది. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆనాడు మాస్టర్ ప్లాన్ పేరుతో హడావుడి చేశారు.
రూ.100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ కోసం రూ.34 కోట్లు విడుదల చేసింది. కాగా, పోయినేడాది ఎన్నికల కోడ్ కారణంగా రాములోరి కల్యాణానికి లాంఛనాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకురాలేకపోయారు.