- చీఫ్ గెస్ట్లుగా కర్నాటకసీఎం సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: నార్సింగి మున్సిపాలిటీని కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ బిల్డింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా కర్నాటక సీఎం సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని మంత్రి తెలిపారు.
మంగళవారం సెక్రటేరియెట్ లో భవన ఓపెనింగ్ పై అధికారులతో మంత్రి పొన్నం రివ్యూ చేశారు. ప్రారంభోత్సవంలో 30 వేల మంది పాల్గొంటారని చెప్పారు. జనసమీకరణ బాధ్యతలు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంకు, కురుమ సంఘ నేతలకు అప్పగించామని తెలిపారు. బిల్డింగ్ రిపేర్లను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
సీఎంల పర్యటన ఏర్పాట్లు, సభ స్థల పరిశీలన తదితర వాటిని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు పరిశీలించాలని సూచించారు. సభా వేదిక, బారికేడింగ్, లైటింగ్, జనరేటర్, పార్కింగ్ తదితర వాటిపై ఆర్ అండ్ బీ అధికారులు చూసుకోవాలన్నారు. స్టేజి డెకరేషన్, బ్యూటిఫికేషన్ బాధ్యతలను హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. అన్ని విభాగాలను బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, హెచ్ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆత్మ గౌరవ భవన ఓపెనింగ్ ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు.