- ఇటీవల వేములవాడలో సీఎం పర్యటనతో అధికారుల కసరత్తు
- ప్యాకేజీ పూర్తయితే మిడ్ మానేరు నుంచి మల్కపేట, ఎగువ మానేరుకు గోదావరి వాటర్
- కొత్తగా 1.20లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి..
రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన 9వ ప్యాకేజీ పనుల్లో కదలిక మొదలైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటన సందర్భంగా సీఎంతోపాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని, అందుకు అవసరమైన ఫండ్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కాళేశ్వరం -9వ ప్యాకేజీ పనులను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
మల్కపేట నుంచి ఎగువ మానేరుకు..
9వ ప్యాకేజీ పనులు పూర్తయితే మిడ్‌మానేరు నుంచి గోదావరి జలాలు మల్కపేట రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి ఎగువమానేరు నింపేందుకు అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా మిడ్‌మానేరు నుంచి మల్కపేటకు 12 కిలోమీటర్ల సొరంగ మార్గంలో నీటిని తరలించి, రెండు పంపులతో 130 మీటర్ల ఎత్తులో ఉన్న మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని లిఫ్ట్ చేస్తారు.మల్కపేట బ్యాక్‌వాటర్‌ను కాల్వల ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి మీదుగా మైసమ్మ చెరువును నింపుతారు. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ శివారులోని సింగసముద్రం చెరువులోకి నీటిని తరలిస్తారు.
రెండో దశలో నాగంపేట తండా వద్ద 2.25 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా గత సర్కార్ హయాంలో పంపులు, మోటార్లు బిగించలేదు. ఇక్కడ పనులు ప్రారంభమైతే గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ బట్టల చెరువులోకి నీరు చేరుతోంది. అక్కడి నుంచి కాల్వల ద్వారా నర్మాలలోని ఎగువమానేరు డ్యాంలోకి గోదావరి జలాలు చేరుతాయి.
9వ ప్యాకేజీపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేటలో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు. అసెంబ్లీ ఎలక్షన్ ముందు రెండు పంపులను ట్రయల్ రన్ చేసి రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీటిని మాత్రమే నింపి మిగతా పనులను పట్టించుకోలేదు. అదే టైంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు నీటిని తీసుకెళ్లే 10, 11, 12 ప్యాకేజీలను మాత్రం పూర్తిచేసింది. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలను సస్యశ్యామలం చేసే 9వ ప్యాకేజీ ఎందుకు పూర్తిచేయలేదని పీసీసీ హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వస్తే ఈ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని ప్రకటించడంతో అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. దీంతోపాటు 9వ ప్యాకేజీ పనుల్లో భాగంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి, రంగంపేట చెరువులోకి గోదావరి నీటిని తరలించేందుకు కాల్వలు, పైపలైన్ పనులు చేపట్టారు.
ALSO READ : జీవో 317 బాధితులకు న్యాయం ఎప్పుడు.?
ఎగువ మానేరు నిండితే సిరిసిల్లతోపాటు వేములవాడ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతాయి. తద్వారా జిల్లాలోని 1.58లక్షల ఎకరాలకు శాశ్వతంగా, కొత్తగా 1.20లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. మొత్తంగా ఈ ప్యాకేజీ ద్వారా రాజన్న జిల్లాలో 2.78లక్షల ఎకరాల సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.
పనులు స్పీడప్ చేయాలని నోటీసులు పంపాం
మిడ్‌మానేరు నుంచి మల్కపేట, ఎగుమమానేరు డ్యాంలోకి నీటిని లిఫ్ట్ చేసేందుకు పనులు స్పీడప్ చేయాలని ఏజెన్సీకి నోటీసులు పంపాం. గంభీరావుపేట మండలం నాగంపేట వద్ద పంప్ హౌస్‌లో సివిల్ పనులు చేపట్టాలని ఏజెన్సీకి నోటిసులిచ్చాం.
- అమరేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ, సిరిసిల్ల