
- రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సంకేట అన్వేష్ రెడ్డి
నిర్మల్, వెలుగు: ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం నిర్మల్‌కు రానున్నట్లు తెలిపారు. సీఎం పాల్గొనే ఆత్మీయ సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి గ్రాడ్యుయేట్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమారెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వల్లే అభివృద్ధి కావట్లే..
నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. అమృత్ 2 పథకం కింద తాగు నీటి కోసం రూ. 62 కోట్లు మంజూరయ్యాయని దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే పనులు ఇప్పటివరకు మొదలు కాలేదన్నారు. శని వారం అమృత్ 2 పథకం కోసం కొనుగోలు చేసి వృథాగా పడి ఉన్న పైపులను పలుచోట్ల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.