సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం ( జనవరి 10, 2025 ) సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కలకలం రేపిన నేపథ్యంలో రేవంత్ పర్యటన టీటీడీ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 6 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగా.. మృతదేహాలకు రుయా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని... వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్.