నవంబర్ 19న వరంగల్​లో సీఎం పర్యటన

నవంబర్ 19న వరంగల్​లో సీఎం పర్యటన
  • కాంగ్రెస్​ సర్కారు ప్రజాపాలన వియోత్సవాల్లో భాగంగా సభ
  • మంత్రి సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి రివ్యూ

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న సీఎం  రేవంత్‌‌రెడ్డి వరంగల్‌‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో  సీఎం రేవంత్​ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలు, జిల్లా, గ్రామ సమైక్య సంఘాల సభ్యులకు వివిధ శాఖల వారీగా ఆస్తులను పంపిణీ  చేయనున్నారు.  సీఎం వరంగల్ పర్యటనపై సెక్రటేరియెట్​లో అధికారులతో మంత్రి కొండా సురేఖ,  సీఎం సలహాదారు వేం నరేందర్‌‌రెడ్డి, సీఎం శాంతికుమారి రివ్యూ నిర్వహించారు.

రూట్‌‌ మ్యాప్‌‌, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్‌‌, తదితర లాజిస్టిక్‌‌ అంశాలు,  భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై  చర్చించారు.  ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం పర్యటనను అందరం కలిసి దిగ్విజయం చేయాలని అన్నారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్‌‌ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం  ఏడాదిలో చేపట్టిన  అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని వేం నరేందర్‌‌రెడ్డి   సూచించారు. గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్​ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.