రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్షించి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వం నిర్ణయంచుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట బోర్డు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని కూడా వాడుకోవాలని ఆయన చెప్పారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నాటికి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు.
#WATCH | Telangana CM Revanth Reddy visits Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple
— ANI (@ANI) November 8, 2024
(Video source: CMO) pic.twitter.com/hV2YebRryl
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని కోరారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాల్సిందేనని.. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.