మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్‌లు, బై బ్యాక్‌ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. అందినకాడికి కొల్లగొడ్తున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి.. చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా, భారతీ బిల్డర్స్, ఆర్జే గ్రూప్ మొదలు.. తాజాగా సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్ట్‌లో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి. ఏండ్ల తరబడి తమ నడుమనే ఉంటూ నమ్మించి, డబ్బులు కట్టించుకొని.. ఉన్నట్టుండి బిచాణా ఎత్తేస్తుండటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ.. కేసులు పెడుతూ అలసిపోతున్నారు.
సీరియస్ గా తీసుకున్న సీఎం
రియల్ ఎస్టేట్వ్యాపారుల మోసాలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెరాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను నియమించారు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్‌కు మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచే ఎలా రికవరీ ఇప్పించేలానే దానిపై లీగల్ ఓపినియన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనే దానిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. రెరా చట్టం ప్రకారం.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక అకౌంట్‌లో పెట్టాలి. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు.
సేల్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు.. డెవలపర్లు, బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌గా అడిగే అవకాశం లేదు. ఇక బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు కూడా చేయరాదు. కానీ ఇవ్వన్నీ ఏమి పట్టించుకోని రియల్ ఎస్టేట్ కంపెనీలు నచ్చిన పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తూ చివరికి బోర్డును తిప్పేస్తున్నాయి. ఆ సొమ్ముతో వాటి యాజమానులు విదేశాలకు ఉడాయిస్తున్నారు.