వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాళోజీ కళా క్షేత్రాన్ని 2024, నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం కాళోజీ కళా క్షేత్ర ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కళా క్షేత్రంలో ఆర్ట్ గ్యాలరీ, కాళోజీ ఫోటో గ్యాలరీని సందర్శించారు. అంతకుముందు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
వరంగల్‌లోని హయాగ్రీవాచారి గ్రౌండ్లో సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రానికి వెళ్లారు. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు ఆయన జీవిత చరిత్రపై తీసిన డాక్యుమెంటరీని మంత్రులతో కలిసి సీఎం వీక్షించారు. అనంతరం డిజిటల్ పద్దతిలో వరంగల్‌లో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
కాళోజీ కళా క్షేత్రం నుండి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నేరుగా వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 14 నుండి వచ్చే నెల (డిసెంబర్) 9వ తేదీ వరకు ప్రజా పాలన -ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వరంగల్ సెంటిమెంట్‌తో ఈ నెల (నవంబర్) 19వ తేదీన వరంగల్‌లో తొలి విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది.