సెక్రటేరియెట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు
బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళలా తెలంగాణ తల్లి రూపం ఉంది. చేతిలో మక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. తెలంగాణలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
ఐదున్నర కోట్లతో విగ్రహం
కాంస్య విగ్రహం ఎత్తు 17 అడుగులు .. మరో 3 అడుగులతో కిందిగద్దె రూపొందించారు. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటెయిన్, పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహం మారినప్పటికీ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది.
ప్రతి ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు
రాష్ట్ర సచివాలయం ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలోనే సీఎం రేవంత్ నిర్ణయించారు. డిసెంబర్ 9న ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు.