
- దివ్యవిమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- ఘనంగా మహాకుంభాభిషేకం..
- సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు
- వేదాశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు
- -నారసింహుడి నామస్మరణతో పులకించిన గుట్ట
- దేశంలో ఎత్తయిన ఐదంతస్తుల మొదటి స్వర్ణతాపడ గోపురం ఇదే
యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట నారసింహుడి దివ్యవిమాన స్వర్ణ గోపురం సాక్షాత్కారం అయింది. దేశంలోనే ఎత్తయిన బంగారు గోపురాన్ని ఆదివారం ఉదయం 11:54 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.. రేవంత్రెడ్డి దంపతులు గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసి.. దివ్యవిమాన స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు మహాకుంభ సంప్రోక్షణను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కొండపైన ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకొని, మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్లమార్గం గుండా దివ్య విమాన బంగారు గోపురంపైకి చేరుకుని, మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో పాలుపంచుకున్నారు. ఉదయం 11:33 గంటల నుంచి 11:56 గంటల వరకు సుదర్శన చక్రానికి నదీజలాలతో కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం త్రితల గోపురం నుంచి ప్రధానాలయంలోకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, నారసింహుడి ఫొటో అందించారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, మందుల సామేల్, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, ఆలయ ఈవో భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తి, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశంలో ఎత్తైన గోపురంగా..
దేశంలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఐదంతస్తుల దివ్యవిమాన గోపురం ఎత్తయిన గోపురంగా నిలిచింది. 50.5 అడుగులు ఎత్తు, 10,754 స్క్వేర్ ఫీట్ల వైశాల్యం ఉన్న స్వామివారి పంచతల దివ్యవిమాన గోపురాన్ని 65 కిలోల 633 గ్రాముల బంగారంతో స్వర్ణమయం చేశారు. దేశంలో కొన్ని ఆలయాలకు మూడంతస్తుల గోపురాలుండగా.. ఐదంతస్తుల స్వర్ణగోపురం ఉన్న ఏకైన క్షేత్రంగా యాదగిరిగుట్ట నారసింహుడి దేవస్థానం రికార్డు సృష్టించింది.
నదీజలాలతో స్వర్ణగోపురానికి కుంభాభిషేకం..
దేశంలోని దాదాపుగా 60 నదుల నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలతో స్వామివారి దివ్యవిమాన గోపురానికి, స్వర్ణ సుదర్శన చక్రానికి అర్చకులు కుంభాభిషేకం నిర్వహించారు. జనవరి 30న ఉప ప్రధానార్చకులు మాధవాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చక బృందం నదీజలాల సేకరణకు బయలుదేరింది. దేశంలోని గోదావరి, పెన్ గంగ, యమున, గంగ, ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం(గంగ, యమున, సరస్వతీ), సరయూ, గోమతి, నర్మదా, మంజీర, తాలిపేరు, హరిద్రా, కృష్ణా, తుంగ, భద్ర వంటి ముఖ్య నదులతోసహా 60 నదుల నుంచి పవిత్ర జలాలను సేకరించారు. వెండి కలశాలలో తెచ్చిన పవిత్ర నదీజలాలను యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభంలో పోసి.. గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ పవిత్ర నదీజలాలతో ఆదివారం దివ్యవిమాన స్వర్ణగోపురానికి కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. మొదట వానమామలై రామానుజ జీయర్ స్వామి కుంభ సంప్రోక్షణ చేయగా.. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మహాకుంభాభిషేక పూజలు చేశారు.