జననీ.. జయకేతనం.. సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

జననీ.. జయకేతనం..  సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
  • సెక్రటేరియెట్​లో వేల మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం
  • ఏటా డిసెంబర్​ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ: సీఎం రేవంత్​రెడ్డి
  • మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం
  • తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు
  • విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తెలంగాణ పయనం
  • 9 మంది కవులు, కళాకారులకు రూ.కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం
  • వీళ్లలో గూడ అంజయ్య, గద్దర్​, అందెశ్రీ, గోరటి వెంకన్న, బండి యాదగిరి, జయరాజ్​, సుద్దాల, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు
  • ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతామని ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) ప్రారంభించింది. సెక్రటేరియెట్​ ఎదుట వేలాది మంది సమక్షంలో 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. ఆకుపచ్చ చీర, ఎర్ర రంగు రవిక, మెడలో గుండ్లు, తీగ (కంటె), హారం, ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ, మక్క కంకులు, కుడి చేతితో రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నట్టు తెలంగాణ తల్లి దర్శనమిచ్చింది. కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, వేల మంది జనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ‘‘సంక్షోభం నుంచి సంక్షేమం వైపు.. అవినీతి నుంచి అభివృద్ధి పథం వైపు.. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. దీనిపై భవిష్యత్​ కార్యాచరణను  అసెంబ్లీలో ప్రకటిస్తం” అని వెల్లడించారు. 

ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు

రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏ ఆకాంక్షల కోసం కొట్లాడినమో..  పదేండ్లు అవి నిర్లక్ష్యానికి గురయ్యాయని.. తెలంగాణ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్​ చెప్పారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు, స్వరాష్ట్రంలో పదేండ్లు నిర్లక్ష్యానికి  తెలంగాణ ప్రజలు గురయ్యారు. ఇవి ఉండకూడదనే టీఎస్​ను టీజీగా మార్చుకున్నం. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం పాటను  తెలంగాణ గీతంగా చేసుకున్నం. ఇప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నం. ప్రతి సంవత్సరం డిసెంబర్​ 9న అధికారికంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా, పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి వేడుకలను జరుపుతాం” అని ప్రకటించారు.తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చినా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 

కన్నతల్లికి ప్రతిరూపంగా

రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు, వ్యక్తులు వాళ్ల ఆలోచనల పరంగా, వాళ్ల విధివిధానాలకు తగ్గట్టు తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని వాటితో ముందుకు కొనసాగారని సీఎం రేవంత్​ గుర్తుచేశారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు పదేండ్లయినా   తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించలేదని.. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి ఏడాది జరుపుకోవాలన్న ఆలోచన చేయలేదని అన్నారు.

 ‘‘తెలంగాణ తల్లి 10 ఏండ్లు వివక్షకు లోనైంది. అందుకే మన అస్థిత్వానికి ప్రతీకగా.. బహుజనుల ఆకాంక్షల మేరకు తండాలలో,  మారుమూల పల్లెల్లో, జన బహుళ్యంలో ఉన్నట్లే తెలంగాణ తల్లిని ఇప్పుడు తీర్చిదిద్దుకున్నాం.  అధికారికంగా ఆవిష్కరించుకున్నాం. చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేనో నాకు ఈ రోజు కండ్లకు కట్టినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే స్ఫురించింది. మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, కవులు, కళాకారులు కావొచ్చు.. ఎవరితో మాట్లాడినా తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే కన్నతల్లి ప్రతిరూపంగా అద్భుతంగా ఉన్నది అంటున్నరు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ల వాళ్ల ఆలోచనలకు అనుకూలంగా, వాళ్ల వాళ్ల పార్టీ విధానాలకు తగ్గుట్టు  మాట్లాడుతుంటారని.. అలాంటి వాటిపట్ల స్పందించాల్సిన అవసరం లేదని నాకు సూచన చేశారు” అని పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రకటన వచ్చిన రోజైన డిసెంబర్​ 9న తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నమవ్వాలనే ఆలోచనతో  ఎలాంటి వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా.. తెలంగాణ తల్లి అవతరణను ఒక పండుగ కార్యక్రమంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. 

గద్దర్​, అందెశ్రీ, గోరటి వెంకన్న సహా తొమ్మిది మందికి సత్కారం

తెలంగాణ ఉద్యమం కోసం సర్వం త్యాగం చేసిన కవులు, కళాకారులు, ఉద్యమకారులను గుర్తించి, సన్మానించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.  ‘‘వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ప్రకటిస్తున్న. సర్వం ఒడ్డి, సర్వంకోల్పోయి లక్షలాది మందిని తెలంగాణ ఉద్యమ బాట పట్టించిన వాళ్లలో గూడ అంజయ్య ఒకరు. ‘అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా’ , ‘రాజిగ ఒరి రాజిగా’ వంటి ఎన్నో పాటలతో ఉద్యమాన్ని ఆయన ముందుకు నడిపించారు. 

గద్దరన్న గురించి, ఆయన పోరాటం గురించి అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరే కాదు..  ‘బండెనక బండి కట్టి’ పాట రాసిన బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్​ తేజ, జయరాజ్​, పాశం యాదగిరి, గన్​పార్క్​ అమరవీరుల స్థూప రూపకర్త ఎక్కా యాదగిరి రావుకు.. ఇట్ల తొమ్మిది మంది కవులు, కళాకారులకు ఫ్యూచర్​ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు, తామ్రపత్రం ఇచ్చి గౌరవించుకుంటం” అని  సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. 

దీన్ని చూసి కొంతమందికి బాధ, ఆవేదన, దు:ఖం ఉండొచ్చని పరోక్షంగా బీఆర్​ఎస్​ నేతలను ఆయన విమర్శించారు. ‘‘వాళ్ల ఆలోచనలు, వాళ్ల రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతాయని ఆ కొందరు అనుకోవచ్చు. బాధ పడొచ్చు. ఒక వ్యక్తి , ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ తెచ్చుకోలేదు. నాలుగు కోట్ల మంది ప్రజల స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నం. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నం” అని సీఎం వివరించారు.

ప్రజల ఆకాంక్షలను గత సర్కార్​ పట్టించుకోలే

ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, ఆస్తిత్వం తల్లి అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి, అమరులై సాధించుకున్న రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకుంటున్నం. ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద, సంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు.. అవహేళన చేసిన సందర్భాలు ఎన్నో చూసినం. ఉద్యమకారులు అమరులై సాధించుకున్న రాష్ట్రంలోనూ అదే పరిస్థితిని చూసినం. ఒక వ్యక్తి.. ఒక కుటుంబం.. ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసింది” అని తెలిపారు. 

ALSO READ :తెలంగాణ తల్లి విగ్రహం.. ఆత్మగౌరవానికి ప్రతీక.. అందరితో చర్చించాకే రూపకల్పన: అసెంబ్లీలో సీఎం రేవంత్​

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రజల ఆకాంక్షాలను నెరవేర్చాలని కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు. ‘‘ఉద్యమ టైమ్​లో తెలంగాణ యువకులు వాళ్లు తిరిగే బండి మీదనే కాకుండా.. గుండెలపైన ‘టీజీ’ అని రాసుకున్నరు. తాము కట్టెల్లో కాలినా కూడా శాశ్వతంగా ‘టీజీ’ గుర్తుండాలని రాయించుకున్నరు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ‘టీజీ’ అని కాకుండా ‘టీఎస్’​ అని నామకరణం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ‘టీజీ’ని తీసుకొచ్చినం. 

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడమే కాకుండా, ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను గత పాలకులు పట్టించుకోలేదు. రాష్ట్ర గీతంగా మారుతుందని పదేండ్లు ఎదురుచూసినం. కానీ, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు  ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా  మార్చుకున్నం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించుకున్నం. ఇది జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం’’ అని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

అందెశ్రీ, గంగాధర్​, రమణారెడ్డికి సన్మానం

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త, జేఎన్​టీయూ ఫైన్ ఆర్ట్స్​ వీసీ గంగాధర్​,  తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి రమణా రెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్​రెడ్డి సన్మానించారు. తెలంగాణ కవులు, కళాకారులకు సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదులు హైదరాబాద్​లో ప్రవహిస్తే ఎట్ల ఉంటుందో.. నలుమూలల నుంచి ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చూస్తుంటే అంత అద్భుతంగా ఉందని, ఈ ఘట్టం చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.