అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలి.. ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలి.. ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫీల్డ్ లో అనుభవం వస్తుందని, పైస్థాయికి ఎదిగినప్పుడు అది ఉపయోగపడుతుందని, కానీ ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి వెళ్లాలలనే ధోరణి తగ్గిపోతోందని అన్నారు. సుదీర్ఘ కాలం సివిల్ సర్వెంట్ గా పని చేసిన గోపాలకృష్ణం నాయుడు రాసిన ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు సీఎం. ఫస్ట్ పీఎం జవహార్ లాల్ నెహ్రూ నుంచి ప్రజెంట్ పీఎం నరేంద్ర మోదీ వరకు పనిచేసిన ఐఏఎస్ అధికారి గోపాల కృష్ణం నాయుడు అని కొనియాడారు. కొత్తగా సర్వీసుల్లో చేరే వారు ఇలాంటి సీనియర్ల నుంచి నేర్చుకోవాలని సూచించారు. 

ఒకప్పుడు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన అధికారులు ఉన్నారని, వారు ఏం చేసిన ప్రజల బాగు కోసమే చేసేవారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. డా.శంకరన్, శేషన్, డా. మన్మోహన్ సింగ్ లాంటి వారు ఎంతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎస్.ఆర్.శంకరన్ ఎప్పుడూ పేద ప్రజల కోసమే ఆలోచించేవారని, వారి జీవితాల్లో వెలుగు తీసుకువచ్చేందుకు పనిచేసి సక్సెస్ అయ్యారని చెప్పారు. అదే విధంగా శేషన్ ఎలక్షన్ కమిషన్ లో సంస్కరణలు తెచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇక మన్మోహన్ సింగ్ బ్యూరో క్రాట్ నుంచి నాయకునిగా సక్సెస్ అయ్యారని అన్నారు. పీవీ నరసింహారావు తో పనిచేసి.. క్లోజ్డ్ ఎకానమి నుంచి  ఓపెన్ ఎకానమి చేయడంలో కీలక పాత్ర పోషించి సక్సెస్ అయ్యారని కొనియాడారు. బ్యూరోక్రాట్ గా, నాయకుడిగా, ప్రధానిగా సక్సెస్ అయ్యారని అన్నారు. ఇలాంటి ఎందరో అధికారులను ఆదర్శంగా తీసుకుని, వారి అనుభవాలను నేటి సివిల్ అధికారులు నేర్చుకోవాలని సూచించారు. 

ALSO READ | భారీ స్కాం.. హైటెక్ సిటీలో ఆఫీస్ కూడా ఎత్తేశారు.. ఒక్క హైదరాబాద్లోనే రూ.850 కోట్లకు దెబ్బేశారు..!

 ఈ సందర్భంగా తన రాజకీయ అనుభవాలను పంచుకున్నారు సీఎం రేవంత్. స్థానికి సంస్థల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, మండలి సభ్యుడిగా.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రస్తుతం సీఎం గా ఎంతో మంది అధికారులను  చూస్తూ  వస్తున్నానని..అప్పట్లో అధికారులు ప్రజా జీవితంలోనే గడిపేవారని అన్నారు. నాయకులు ఏదైనా చేద్దాం అనుకున్నపుడు అందులో ఉండే మంచి చెడులు గురించి చెప్పేవాళ్లని, నాయకులు మంచి నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించేవారని అన్నారు. 

ప్రజలను సంతోష పెట్టేందుకు నాయకులు హామీలు ఇస్తుంటారని, కానీ దాంట్లో ఉన్న లోటు పాట్లు చెప్పి మంచి డైరెక్షన్ లో నడపాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అలా చెప్పే వారు లేరని, ఇలాంటి సీనియర్ల నుంచి నేర్చుకుని పరిపాలనలో మార్పులు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు తప్పు చేయొద్దు అని చెప్పే వారికంటే ఒకతప్పుకు  బదులు మూడు చేద్దాం సార్ అని చెప్పేవాళ్లే ఎక్కువ అని చమత్కరించారు. ఇప్పుడున అధికారుల శైలి పట్ల అంత సంతృప్తిగా లేమని, కొత్త అధికారుల తీరు మారాలని సూచించారు. త్వరలో సీనియర్ అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టాలని సీఎస్ కు ఆదేశించారు సీఎం.