అభివృద్ధికి రేవంత్ విజన్.!

అభివృద్ధికి  రేవంత్ విజన్.!

లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుంచి  కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలలో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను రూపొందించుకొని పనిచేశారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని బలంగా విశ్వసించారు. కాబట్టి,  కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటానికి తన పార్టీ ఎంపీల  బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భావించారు.  రాష్ట్రం తరఫున పార్లమెంటులో గళం వినిపించే పార్లమెంటు సభ్యుల బలాన్ని పెంచుకోవడం కోసమే సీఎం  రేవంత్ రెడ్డి అత్యధిక స్థానాలు గెలవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో పోలింగ్​ సరళి కూడా కాంగ్రెస్​ ప్రభుత్వానికి పాజిటివ్​గా కనిపించింది. 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫెడరల్ స్ఫూర్తితో  కేంద్రంతో వ్యవహరిస్తున్నారు.  గత ప్రభుత్వ ఘర్షణాత్మక వైఖరికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు,  ప్రాజెక్టులు, అనుమతులు, గ్రాంట్లు తేవాలనే నిర్ణయంలో భాగంగానే ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలవటం రాష్ట్ర ప్రతిపాదనలు వారి ముందు పెట్టడం జరిగింది. రాష్ట్రానికి అధికార పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలుకుతూ ప్రధానిని పెద్దన్నగా  వర్ణిస్తూ  రాష్ట్ర  ప్రయోజనాలను  కాపాడటానికి  ప్రభుత్వ అధినేతగా  బేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాననే సంకేతాన్ని  సీఎం రేవంత్ రెడ్డి పంపారనే చెప్పాలి.  కానీ, దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, మాజీ సీఎం చంద్రశేఖరరావు  నిత్యం కేంద్ర ప్రభుత్వంతో,  ప్రధానమంత్రితో  ఘర్షణాత్మక వైఖరితో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారనే చెప్పాలి.  కనీసం ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు అధికారిక హోదాలో వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకకపోవటం రాష్ట్ర ప్రతిపాదనలు ప్రధాని ముందు పెట్టకపోవడం వలన తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలి.   విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించటానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా  మాజీ  సీఎం కేసీఆర్​ కేంద్ర ప్రభుత్వంతో  డిప్లమాటిక్ పాలిటిక్స్ చేయకపోవడం వలన రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడిందనేది వాస్తవం. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గత అధికార పార్టీ ఎంపీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఎప్పుడూ కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వలేదు. 

తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో

విభజన చట్టంలోని హామీల సాధన కోసం క్షేత్రస్థాయిలో పార్లమెంట్ హౌస్ సాక్షిగా కూడా పోరాటం చేయకపోవడం వలన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించినా, పసుపు బోర్డు ప్రకటన చేసినా, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించినా, అది అనివార్యమైన పరిస్థితులలో చేసిన పనులుగానే చూడాలి. కానీ వాటి సాధనలో గత ప్రభుత్వం ప్రత్యేక కృషి  ఏమీ లేదనే చెప్పాలి. అందుకే తెలంగాణ నుంచి కాంగ్రెస్​ ఎంపీలను అత్యధిక సంఖ్యలో లోక్​సభకు పంపాలనే పట్టుదల సీఎం రేవంత్​రెడ్డికి పెరిగింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో విడుదల చేసిన జాతీయ మేనిఫెస్టోకి అనుబంధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక మేనిఫెస్టోని తయారుచేసి తన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా చెప్పింది. 

తెలంగాణ అభివృద్దే రేవంత్​ లక్ష్యం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తప్ప మరి ఏ పార్టీ కూడా ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేయలేదు.  విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ – నాగపూర్, హైదరాబాద్– వరంగల్,  హైదరాబాద్ – నల్గొండ, హైదరాబాద్– బెంగళూరు, సింగరేణి ఇండస్ట్రియల్ లాంటి ఐదు ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, సైనిక్ పాఠశాలలు, కేంద్ర విద్యాసంస్థలు, నవోదయ విద్యాసంస్థల సాధన, డ్రైపోర్ట్ నిర్మాణం, క్రీడా విశ్వవిద్యాలయం, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఐటిఐఆర్ ప్రాజెక్టు సాధన, మేడారం జాతరకి జాతీయ పండుగగా గుర్తింపు, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధన, రైల్వే ప్రాజెక్టుల సాధన, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు లాంటి వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధించటం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కొత్త రూపం ఇవ్వాలనేదే రేవంత్ రెడ్డి విజన్​గా కనిపిస్తోంది.

రేవంత్​ నారెటివ్​లు క్లిక్​ అయ్యాయి

దేశవ్యాప్తంగా  జరుగుతున్న ఎన్నికలలో  మోదీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అనుకూలతను, మోదీ  కరిష్మాను తగ్గించి,  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో  నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఫలించినట్లుగానే ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.  ఎన్నికల ప్రచారంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా  కాకుండా బీజేపీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చి రేవంత్ రెడ్డి  సఫలీకృతమైనట్లుగానే కనిపిస్తున్నది. తెలంగాణ వర్సెస్ గుజరాత్ తో  తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెరపైకి తెచ్చి దశాబ్ద బీజేపీ పాలనలో తెలంగాణకి గాడిద గుడ్డు  ఇచ్చారనే ప్రచారంతో  లోక్ సభ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధించినట్లుగానే కనిపిస్తోంది.  ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో  రాజ్యాంగం, రిజర్వేషన్లు  ప్రస్తావన తెస్తే,  రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గెలవాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు. దీంతో  ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గినట్లుగా కనిపిస్తుంది. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి మోదీ, షాలు  ప్రయోగించిన డబుల్ ఆర్ ట్యాక్స్ ప్రజలను మెప్పించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ లక్ష్యాన్ని  సాధిస్తుందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.  పార్లమెంటు సభ్యుల బలంతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే రేవంత్ రెడ్డి విజన్​గా కనిపిస్తోంది. కాబట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎంపీ ఎన్నికలలో మెజార్టీ స్థానాల్లో  గెలుపొందాలి.  తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక బలమైన పార్లమెంటు సభ్యుల టీంని ఏర్పాటు చేసుకోవాలని రేవంత్ రెడ్డి వ్యూహం.  తెలంగాణ లాంటి విభజిత  రాష్ట్రంలో  రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా  ప్రజలు ఈ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాలనే  ఓట్లు వేసినట్లుగా ఓటింగ్ సరళి వెల్లడిస్తున్నది. ప్రజల ఆకాంక్షల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత  దీక్షతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయాలని ఆశిద్దాం.

- డాక్టర్ తిరునాహరి శేషు,పొలిటికల్ ఎనలిస్ట్