- కాంగ్రెస్ అభ్యర్థులు రాఘురామిరెడ్డి, బలరాం నాయక్ లకు మద్దతుగా సభ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగూడెంలో శనివారం పర్యటించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు రామసహాయం రాఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్ విజయం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఖమ్మం లోక్ సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ఇన్‌చార్జీలుగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను బహిరంగ సభకు తరలించేందుకు ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసమీకరణ చేసేందుకు మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు సన్నాహాక సమావేశాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా మంత్రులు ప్లాన్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పై కుట్రలు పన్నుతున్నరు : తుమ్మల
బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటై ఆర్నెల్లు, మూడు నెలలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను తుమ్మల శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడంతో పాటు రాహుల్ ప్రధాన మంత్రిగా చూడాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రాజెక్టుల పేర రూ.వేలకోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. భద్రాచలం నుంచి ఏపీకి వెళ్లిన ఐదు గ్రామాలను తీసుకు రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. లోపాయి కారి ఒప్పందం చేసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ స్టేట్ సెక్రటరీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్, సీపీఐ నాయకులు సాబీర్ పాష, తుళ్లూరు బ్రహ్మయ్య, ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, బిక్క సాని నాగేశ్వరరావు పాల్గొన్నారు.