ఇవాళ వరంగల్​కు సీఎం రేవంత్​

  •     అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

వరంగల్, వెలుగు: సీఎం రేవంత్‍రెడ్డి నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతరం గ్రేటర్​లోని హనుమకొండ కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. లోక్‍సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రేటర్ వరంగల్‍ వచ్చిన సీఎం రేవంత్​రెడ్డి జిల్లా అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. వరంగల్‍ జిల్లాను రెండో రాజధానిగా డెవలప్‍ చేయనున్నట్లు తెలిపారు. 

ఇందులో భాగంగా అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ, మామునూర్ ఎయిర్‍పోర్ట్ రీ ఓపెనింగ్, ఇండస్ట్రీయల్‍ కారిడార్​ వంటి అంశాల్లో సీఎం ప్రత్యేక చొరవ చూపనున్నట్లు తెలిపారు. కాగా, పార్లమెంట్ఎన్నికల కోడ్‍ ముగియడంతో ఇచ్చిన మాట ప్రకారం శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. 

టెక్స్​టైల్​ పార్క్​ సందర్శనతో మొదలు..

వరంగల్‍ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలోని కాకతీయ మెగా టెక్స్​టైల్​పార్కు సందర్శనతో శనివారం సీఎం పర్యటన ప్రారంభమవుతుంది. సీఎం అక్కడ మొక్కలు నాటుతారు. పార్క్ అభివృద్ధిపై అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‍ చూశాక, పాత వరంగల్‍ సెంట్రల్‍ జైల్ ఆవరణలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనులను పరిశీలిస్తారు. 

అనంతరం హనుమకొండ కలెక్టరేట్‍ చేరుకుంటారు. గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్, కాకతీయ అర్బన్‍ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన పనులతోపాటు ప్రధాన ప్రాజెక్ట్​లపై అధికారులతో రివ్యూ ఉంటుంది. హనుమకొండ హంటర్‍రోడ్‍లోని మెడికవర్‍ హాస్పిటల్‍ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్‍రెడ్డి  గ్రేటర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వరంగల్‍ కలెక్టర్‍ సత్య శారదాదేవి, వరంగల్‍ పోలీస్‍ కమిషనర్ అంబర కిషోర్‍ఝా మెగా టెక్స్​టైల్​పార్క్​ను సందర్శించి, ఏర్పాట్లపై అధికారులకు తగిన సూచనలు చేశారు. 

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి సైతం అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. హనుమకొండలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం రాక సందర్భంగా కాంగ్రెస్‍ పార్టీ శ్రేణులు సిటీలో భారీ ఫ్లెక్సీలతో జంక్షన్లను ముస్తాబు చేశారు. కాగా, సీఎం వరంగల్‍ పర్యటన శనివారం మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 7.20 వరకు సాగనున్నది.