తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్ కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 14) సందర్శించారు. రంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై కొంగరకలాన్‌లోని ఫిట్ కేకే పార్క్ (ఫాక్స్ కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజి, కొంగరకలాన్ పార్క్) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ALSO READ | నైతిక విలువలే లేవు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ఫాక్స్ కాన్ ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. సీఎం పర్యటనలో సందర్భంగా శాసనమండలి విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, ఫాక్స్ కాన్ ప్రతినిధులు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మెన్ చిలుక మధుసుదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశంక తదితరులు పాల్గొన్నారు.