
రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే... సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజా ప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇప్పటికే పలువురు లబ్దిదారుల ఇళ్లల్లో భోజనం చేశారు.ఇదిలా ఉండగా.. కొత్తగూడెం జిల్లా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో సన్నబువ్వ భోజనం చేశారు సీఎం రేవంత్ .
ఆదివారం ( ఏప్రిల్ 6 ) శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న సీఎం.. అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. లబ్దిదారుని ఇంటిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహా జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా చర్యలను పరిశీలించారు.
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం... సారపాకలో సన్నబియ్యం భోజనం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి భోజనానికి విచ్చేయడంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.