- కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం
- అక్కడ స్టూడెంట్లకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణపై ప్రశంసలు
హైదరాబాద్, వెలుగు: కన్హా శాంతి వనంలో విద్యార్థులకు నేర్పిస్తున్న సాఫ్ట్ స్కిల్స్ ను ప్రభుత్వ బడులు, రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని కన్హా శాంతి వనంను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.
అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను సీఎం సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు ఆయనకు వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను సీఎం సందర్శించారు. అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద మొక్కను నాటి మెడిటేషన్ హాల్ ను సందర్శించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, దాజీ కమ్లేష్ పటేల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.