
మహబూబ్నగర్/ అమ్రాబాద్: సీఎం రేవంత్ రెడ్డి SLBC టన్నెల్ వద్దకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలను సీఎం స్వయంగా పరిశీలించారు. 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ను మంత్రులు ఉత్తమ్, జూపల్లి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. GP రాడార్తో కార్మికులను రెస్క్యూ టీం ఇప్పటికే గుర్తించింది. ఒక ఏరియాలో నలుగురు, TBM ముందు మరో నలుగురు ఉన్నట్లు గుర్తించారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర ఫిబ్రవరి 22 ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు చెందిన జీపీఆర్ స్కానర్ ద్వారా టీబీఎం మిషిన్‌కు ముందు ఒకచోట నాలుగు డెడ్‌బాడీలను, దాని కింద రెండు చోట్ల మరో నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు. మిషిన్ ముందు భాగంలోని నాలుగు మృతదేహాలు మూడు ఫీట్ల బురదలో ఉన్నాయి. వాటిని ఆదివారం వెలికితీసే అవకాశం ఉంది.
ఈ డెడ్‌బాడీలు ఉన్న ప్రాంతమంతా గట్టిపడింది. అయినప్పటికీ యంత్రాలతో కాకుండా మనుషుల ద్వారానే తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. మిషిన్ కింది భాగంలో ఉన్న మిగిలిన నాలుగు మృతదేహాలను వెలికితీయడానికి టీబీఎంను కట్ చేస్తున్నాం. ఇందుకు మరికొంత సమయం పడ్తుంది. టన్నెల్లోపలి నుంచి బురద, మట్టి, టీబీఎం శకలాలను తొలిగించే ఆపరేషన్నిరంతరాయంగా కొనసాగుతున్నది” అని జూపల్లి వెల్లడించారు.