మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్

మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్
  • విమెన్ ​హెల్త్ ​కేర్​కు కట్టుబడి ఉన్నం: సీఎం రేవంత్​రెడ్డి
  • మహిళా సాధికారత కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు
  • గచ్చిబౌలిలో పింక్ పవర్​ రన్​–2024 కార్యక్రమానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటళ్లను నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. విమెన్ ​హెల్త్​ కేర్​కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని, సమాజ శ్రేయస్సుకు పునాది పడుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నదని చెప్పారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్​ గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్-–2024 కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పింక్​ పవర్​ రన్​లో పాల్గొన్న ప్రతి ఒక్కరు వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో మహిళలు ఒంటరిగానే సవాళ్లు అధిగమించేలా చేస్తుందని అన్నారు. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. అందరం కలసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత కలిగిన భవిష్యత్తును నిర్మించేందుకు పాటుపడదామని అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు.

క్యాన్సర్​పై అవగాహన కల్పించాలి: మంత్రి దామోదర

క్యాన్సర్​ అనేది ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అడ్వాన్స్​డ్​ స్టేజ్​లోగా నీ ఇది బయటపడదని, అలాంటప్పుడు దాని ప్రమాదాన్ని ఊహించలేమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు క్యాన్సర్​పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా రాష్ట్రమంతటా క్యాన్సర్​​అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.