
- కేసీఆర్ పనైపోయింది.. కారు ఖార్కానాకే: సీఎం రేవంత్
- మోదీ, కేసీఆర్ తోడు దొంగలు
- పదేండ్లు రాష్ట్రానికి వాళ్లు చేసిందేంది?
- మొన్న కేసీఆర్ సర్కార్‌ను బొందపెట్టినం
- ఇప్పుడు మోదీ సర్కార్‌ను బొందపెట్టాలి
- వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు
- అమలు చేస్తున్నం.. పంద్రాగస్టులోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తం
- మెదక్‌లో ఎన్నికల ప్రచార సభలో వెల్లడి
మెదక్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ జోలికివస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘పదేండ్లు ఇక్కడ్నే ఉంటం.. ఎవడొచ్చినా పండబెట్టి తొక్కుతం.. పదేండ్లు ఇందిరమ్మరాజ్యం ఉంటది.. ప్రజాపాలన జరుగుతది” అని చెప్పారు. తాము అల్లాటప్పగా అధికారంలోకి రాలేదని, అడ్డంవచ్చిన వాళ్లను తొక్కుకుంటూ, ప్రజల ఆశీర్వాదంతో వచ్చామని ఆయన తెలిపారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం మెదక్‌లో జరిగిన రోడ్‌షోలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
రాందాస్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ దుకాణం బందైంది. కారు ఖార్కానాకు పోవాల్సిందే.. తుక్కు కింద అమ్మాల్సిందే’’ అని అన్నారు. ‘‘కేసీఆర్ నౌకరీ పోయి, నడుం విరిగి ఫామ్ హౌస్‌లో లేవలేకుండా పడుకున్నడు. భజన సంఘాన్ని పిలుచుకుని కాంగ్రెస్ ఖాళీ అయిపోతుందని చెప్తున్నడు. అదేమన్న రెండు లీటర్ల ఫుల్ బాటిలా.. 20 పెగ్గులేస్తే ఖాళీ కావడానికి? ఈడ కాంగ్రెస్ పార్టీకి కాపలా ఉన్నది ఎవడనుకుంటున్నవ్.. టచ్ చేసి చూడు కరెంట్ వైర్ కు తగిలిన కాకిలెక్క మాడి పోతావ్.. నీ తాత ముత్తాతలు గుర్తుకురావాలె” అని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో ఐదింటిని అమలు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని, ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించారని వివరించారు. ‘‘పేదల కండ్లలో ఆనందం చూడలేక.. కేసీఆర్ కండ్లలో జీడి పోసుకుంటున్నడు” అని మండిపడ్డారు. ‘‘స్విస్ బ్యాంక్‌లలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి పేదల బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానన్న మోదీ ఏఖానా కూడా వేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లెలా అడుగుతరు? ఇచ్చిన మాట తప్పిన మోదీ సర్కార్‌ను బండకేసి కొట్టాలి. పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పిన బీజేపీని గద్దె దించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రైతులపై కేసులు పెట్టిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దుర్మార్గుడని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్‌సాగర్ కోసం 14 గ్రామాలను పొట్టనబెట్టుకుని, 50 వేల ఎకరాలు గోదావరి జలాల్లో ముంచిండు. కలెక్టర్‌గా ఉండి భూముల కోసం వందలాది మంది రైతుల మీద కేసులు పెట్టిచ్చిండు. ఆడబిడ్డలను పరిగెత్తించి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
వెంకట్రామిరెడ్డి నిజాం కాలంలోని ఖాసీం రజ్వీలా ఫామ్‌హౌస్‌కు గులాంగిరి చేశారని విమర్శించారు. ‘‘మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావ్ ఇదివరకు దుబ్బాక బై ఎలక్షన్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోదీ నుంచి పైసలు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తా అన్నడు. రఘునందన్‌ను ప్రశ్నిస్తున్నా.. బస్సుల్లో మేం దుబ్బాకకు వస్తాం, కేంద్రం నుంచి నువ్వు తెచ్చిన నిధులెన్ని, మోదీ ఇచ్చిన పరిశ్రమలెన్నిచూపిస్తవా?’’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు తిరస్కరిస్తే రంగుమార్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని రఘునందన్ రావుపై మండిపడ్డారు. బలహీనవర్గాల బిడ్డ నీలం మధుకు ఓటేసి ఎంపీగా గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప వాళ్లు తెచ్చిందేంది?
కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉన్నా మెదక్ జిల్లాలో ఇరవై ఐదేండ్ల కింద ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయినప్పుడు మంజూరైన పరిశ్రమలు తప్ప ఒక్కటి రాలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఇందిరా గాంధీ హయాంలోనే బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు, వేలాది కంపెనీలు వచ్చినయ్. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించినయ్. మెదక్ జిల్లా బెంగాల్, బీహార్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులను అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇచ్చింది.
మెదక్ ఎంపీ స్థానం నుంచి ఇన్నాళ్లూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గెలిచినా అప్పట్లో ఇందిరమ్మ మంజూరు చేయించిన పరిశ్రమలు తప్ప ఆ నేతలు ఒక్క పరిశ్రమ తేలేదు. ఒక్కరికీ ఉద్యోగం ఇప్పియలేదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫామ్‌హౌస్ కాడ పేదలు ధర్నా చేసిన్రు
‘‘గతంలో కాంగ్రెస్హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా ఇండ్లు కట్టించిందని, తాము పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తమని చెప్పిన కేసీఆర్ మెదక్ జిల్లాలో ఎన్ని ఇండ్లు కట్టిచ్చారో చెప్పాలి” అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. మొన్ననే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర గజ్వేల్ పేదలు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఆందోళన చేశారని ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల మంది పేదలకు ఇండ్లు కట్టిస్తున్నదని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన చెప్పారు.
పంద్రాగస్టులోపు రుణమాఫీ
‘‘మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా.. వచ్చే పంద్రాగస్టులోగా రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసే బాధ్యత నాదే” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే సీజన్ నుంచి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తామన్నారు. రైతు రుణమాఫీపై మామ, అల్లుళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేసీఆర్, హరీశ్ రావుపై ఆయన మండిపడ్డారు.
23న కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 23న తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. మద్దూరు మండలంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ జాతరలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేస్తారని సీఎం వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డి లెక్క కాదు.. రేవంత్ రెడ్డిని. బట్టలిప్పిచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడ్తం. మోదీ, కేసీఆర్ తోడు దొంగలు. లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లను ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతది. మొన్న డిసెంబర్లో గజ్వేల్ కేడీ (కేసీఆర్)ని బొందపెట్టినం.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోదీ సర్కార్‌ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి. మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా.. వచ్చే పంద్రాగస్టులోగా రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేసే బాధ్యత నాదే.
- సీఎం రేవంత్‌రెడ్డి