పవర్​ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దోపిడీ .. ఎవరు దిగమింగారో తేలుస్తం : సీఎం రేవంత్​రెడ్డి

పవర్​ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దోపిడీ .. ఎవరు దిగమింగారో తేలుస్తం : సీఎం రేవంత్​రెడ్డి
  • బీఆర్​ఎస్​ నేతలకు సీఎం రేవంత్​ హెచ్చరిక
  • బీహెచ్​ఈఎల్​కు కాంట్రాక్టుఇవ్వడంలోనే అసలు మతలబు
  • ఇసుక, కంకర, సివిల్​ సబ్​ కాంట్రాక్టులన్నీ బినామీలకే అప్పగించారు
  • పవర్​పై ఎంక్వైరీ అడిగిందే వాళ్లు.. ఎంక్వైరీ ఆపాలంటూ కోర్టుకెళ్లిందీ వాళ్లే
  • కేసీఆర్​ సత్య హరిశ్చంద్రుడే అయితే విచారణకు ఎందుకు పోతలే?
  • సుప్రీం తీర్పును కూడా వక్రీకరిస్తున్నరుచేసిన పాపం ఊరికేపోదు
  • ఆడబిడ్డలనూ జైల్లో పెట్టిచ్చిన్రు.. ఇప్పుడు వాళ్లకు అదే గతి పట్టిందని వ్యాఖ్య​
  • అర్ధరాత్రి ఒకటిన్నర వరకు సాగిన సభ.. పద్దులపై సమాధానమిచ్చిన భట్టి
  • పవర్​ కమిషన్​కు కొత్త చైర్మన్​ను నియమిస్తం: సీఎం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్​ఎస్​ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్​ ప్లాంట్ల పేరిట రూ.13,015 కోట్లు నష్టం వచ్చేలా చేశారని.. ఇంత సొమ్ము ఎవరు దిగమింగారో తేలుస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘బీహెచ్​ఈఎల్​కు మొత్తం పనులు నామినేషన్​ బేస్​ మీద ఇచ్చినట్లు, గవర్నమెంట్ టు గవర్నమెంట్​ ఇస్తే కమీషన్లు వస్తాయా అని బీఆర్​ఎస్​ నేతలు అంటున్నరు. వాళ్లు ఎక్కడ గండి కొట్టారో.. ఎక్కడ బొక్కారో.. ఎక్కడ మెక్కారో మాకేం తెల్వదు అనుకుంటున్నరా ? మేం ఏం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినం అనుకుంటున్నరా” అని ఫైర్​ అయ్యారు. 

బీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నట్లు కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే, అంత నిజాయితీపరుడే అయితే జ్యుడీషియల్​ కమిషన్ ముందు విచారణకు ఎందుకు హాజరైతలేరని సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. పవర్ ప్లాంట్లకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, సివిల్ వర్క్ కాంట్రాక్టుల విషయంలో బీఆర్ఎస్ వాళ్లు అతితెలివి ప్రదర్శించారని మండిపడ్డారు. బీహెచ్​ఈఎల్ సివిల్ వర్క్స్ చేయదని.. ఆ సబ్​ కాంట్రాక్టు పనులన్నీ బీఆర్ఎస్ వాళ్ల బినామీలకు కట్టబెట్టుకున్నారని అన్నారు. ఇసుక, కంకర ఇలా అన్నీ  వాళ్ల వాళ్లకు ఇచ్చుకుని.. జనాన్ని ముంచారని ఫైర్​ అయ్యారు. అసెంబ్లీలో పద్దులపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి విద్యుత్ శాఖపై మాట్లాడారు. భద్రాద్రి పవర్​ ప్రాజెక్ట్​లో రూ.2,500 కోట్లకుపైగా, యాదాద్రి పవర్​ ప్లాంట్​లో రూ.10 వేల కోట్లకు పైగా అంచనాలు పెంచి మింగేశారని అన్నారు. 

నిషేధించిన టెక్నాలజీని వాడి ముంచిన్రు

కాలం చెల్లిన సబ్ క్రిటికల్​ టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్​ను బీఆర్​ఎస్​ పాలనలో నిర్మించారని, అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని సీఎం రేవంత్​ తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్​ అనే గుజరాత్​ కంపెనీతో కూడబలుక్కుని, బీహెచ్​ఈఏల్​ నుంచి నామి నేషన్​ బేసిస్​​ మీద సబ్ క్రిటికల్​ టెక్నాలజీ మెషీన్లు కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్‌‌ ప్లాంట్​ను రెండేండ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకుంది. కానీ, రెండేండ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టుకు ఏడేండ్లు ఎందుకు పట్టింది?” అని సీఎం రేవంత్​ నిలదీశారు. నాడు తెలంగాణలో 2,400 మెగావాట్ల విద్యుత్​కు టెండర్లు పిలిస్తే.. బీహెచ్​ఈఎల్ ఇతర కంపెనీలు పాల్గొన్నాయని అన్నారు. అదే తేదీన జార్ఖండ్​లో  2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్​ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి టెండర్ పిలిస్తే కొరియన్ కంపెనీ, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయని.. అక్కడ 18 శాతం తక్కువకు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 

ఇక్కడ కూడా 18 శాతం లెస్‌‌ కు పనులు చేసే అవకాశం ఉన్నా..  యాదాద్రి ప్రాజెక్టును నామినేషన్‌‌ పై బీహెచ్ఈఎల్‌‌ కు అప్పగించారని, అందులో రూ. 8వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో గుజరాత్‌‌ లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారని అన్నారు. ఇండియా బుల్స్ నుంచి రూ. వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదని సీఎం  విమర్శించారు. వాళ్ల(బీఆర్​ఎస్​) నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

కమిషన్​ ముందుకు ఎందుకు వెళ్తలే

‘‘మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఆక్రోశం, ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ ఆయన చర్లపల్లి జైలులో అన్నట్లుగా భావిస్తున్నరు” అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. పవర్​ ప్రాజెక్టులపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ చేయిస్తామని తాము అనలేదని, జగదీశ్​రెడ్డి కోరితేనే  ఏర్పాటు చేశామని, కానీ కమిషన్​ విచారణనే రద్దు చేయాలని వాళ్ల నాయకుడు కేసీఆర్​ కోర్టుకు వెళ్లారని అన్నారు. విచారణను నిలిపివేయడం కుదరదని కోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. ‘‘కలియుగంలో పుట్టిన సత్యహరిశ్చంద్రుడు కేసీఆర్​ అని జగదీశ్​రెడ్డి చెప్పుకున్నరు. 

విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణను ఇదే సభలో ఆయన అడిగారు. వాళ్లు అడిగితేనే ఎంక్వైరీకి ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్ ఎల్​. నర్సింహారెడ్డిని నియమించాం. విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని జస్టిస్​ నర్సింహారెడ్డి అడిగితే.. బాధ్యతగల పౌరుడిగా విచారణ కమిషన్​ ముందు వాదన వినిపించి ఉంటే వారి(కేసీఆర్​) నిజాయితీ బయటకు వచ్చేది. కమిషన్​ ముందుకు వెళ్లకుండా ఆ కమిషనే వద్దు.. 

ఆ వ్యక్తే వద్దు అంటూ హైకోర్టుకు కేసీఆర్​ వెళ్లిండు. కేసీఆర్​ వాదనను కోర్టు తిరస్కరించింది. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లిండు. కమిషన్​ ఎంక్వైరీని క్వాష్​ చేయాలని అడిగారు. కమిషన్​ను కొనసాగించాల్సిందేనని, అయితే చైర్మన్‌‌ ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దానికి అభ్యంతరం లేదని చెప్పి మారుస్తామన్నం. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌‌ ను నియమిస్తం. కేసీఆర్​ ఆయన టీమ్​ నిజాయితీపరులే అయితే కమిషన్​ ముందు ఎందుకు విచారణ అటెండ్​ కాలే’’ అని సీఎం రేవంత్ రెడ్డి​ అన్నారు.  

ఏదో చేసినట్లు పొంకనాలు కొడ్తున్నరు

‘‘వాళ్లేదో తెలంగాణకు విద్యుత్​ వెలుగులు తెచ్చినట్లు.. తద్వారా తెలంగాణ ధగధగ మెరిసిపోతున్నట్లు ఇంకా ఎంతకాలం ఊదరగొడుతారు?” అని బీఆర్​ఎస్​ తీరుపై సీఎం మండిపడ్డారు. ఆనాడు యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్​ సంక్షోభం నుంచి బయటపడ్డామని తెలిపారు. వాస్తవానికి 36 శాతమే తెలంగాణలో విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, అలాంటి సమయంలోనే జైపాల్​రెడ్డి తీవ్రమైన కృషి చేశారన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడారని పేర్కొన్నారు. 

సుప్రీం తీర్పును కూడా వక్రీకరిస్తున్నరు

విద్యుత్​ కొనుగోళ్ల అక్రమాలపై వేసిన జ్యుడీషియల్​ కమిషన్​ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా బీఆర్​ఎస్​ నేతలు వక్రీకరిస్తున్నారని సీఎం రేవంత్​ ఫైర్​ అయ్యారు.  ‘‘కోర్టు చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నరు. ఇలాగైతే వాళ్లను ప్రాసిక్యూట్​ చేయాల్సి వస్తుంది. జ్యుడీషియల్​ కమిషన్​ను రద్దు చేయాల్సిందిగా కేసీఆర్​ సుప్రీంకోర్టుకు వెళ్తే.. కోర్టు తిరస్కరించింది. కమిషన్​ చైర్మన్​ను మార్చాలని మాత్రమే చెప్పింది. చైర్మన్​ను మార్చేందుకు మేం  అంగీకరించాం. ఈ తీర్పును బీఆర్​ఎస్​ నేతలు వక్రీకరిస్తున్నరు” అని అన్నారు. 

నిర్మాణ అంచనాలు అమాంతం పెంచేశారు

భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్ల నిర్మాణ వ్యయాన్ని నాటి బీఆర్​ఎస్​ పాలకులు అమాంతం పెంచేశారని, దాని వెనుక మతలబు ఏందని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘2015లో భద్రాద్రి పవర్​ ప్లాంట్​ను రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. కానీ, 2022లో పూర్తి చేశారు. నిర్మాణ ఖర్చులను రూ.10,515 కోట్లకు పెంచేశారు. అంచనా వ్యయాన్ని దాదాపు 45 శాతం పెంచేశారు. భద్రాద్రి ద్వారా ఒక్క మెగావాట్​ కరెంట్​ ఉత్పత్తికి రూ.9.73 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. అదే మాదిరిగా యాదాద్రి పవర్​ ప్లాంట్​ను రూ.25,099 కోట్లతో ప్రారంభించారు. 

2015 జూన్​ 1న బీహెచ్​ఈఎల్​తో ఒప్పందం చేసుకున్నారు. 2021లోగా పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టి ఎనిమిదేండ్లవుతున్నా ఇప్పటికీ పూర్తవ్వలేదు. టెండర్లు పిలిస్తే 45 రోజులు సమయం వృథా అవుతుందని బీహెచ్​ఈఎల్​కు అప్పజెప్తున్నామని నాటి బీఆర్​ఎస్​ పాలకులు అన్నారు. తద్వారా విద్యుదుత్పత్తిని వేగంగా స్టార్ట్​ చేయొచ్చని ప్రగల్భాలు పలికారు. కానీ, పవర్​ ప్లాంట్​ మాత్రం పూర్తి కాలేదు. అంచనా వ్యయం మాత్రం రూ.34,548 కోట్లకు పెరిగింది. భవిష్యత్​లో అది రూ.40 వేల కోట్లయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్క మెగావాట్​ విద్యుదుత్పత్తికి రూ.8.64 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఒక్క మెగావాట్​ విద్యుదుత్పత్తికి రూ.10 కోట్లు అయ్యే అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు. 

ఎన్టీపీసీకి ఎందుకియ్యలే?

తెలంగాణకు విద్యుత్​ ఇవ్వాలన్న ఉద్దేశంతో 4,000 మెగావాట్లతో ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్​ను ఏర్పాటు చేసేలా విభజన చట్టంలో నాటి పీఎం మన్మోహన్​ సింగ్​ పేర్కొన్నారని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఆ ప్లాంట్​ ద్వారా 85 శాతం కరెంట్​ను మనకే ఇచ్చేలా చూశారని తెలిపారు. కానీ, గత బీఆర్​ఎస్​ పాలకులు దానిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎన్టీపీసీకి అనుమతిచ్చిందని పేర్కొన్నారు.   

తెలంగాణ కోసం ఎవరెంత మాట్లాడిన్రో తేలుద్దాం

తెలంగాణ కోసం తాను సభలో కొట్లాడానని, పార్లమెంట్​లో కేసీఆర్​కనీసం మాట్లాడనూ లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కావాలంటే అసెంబ్లీ, పార్లమెంట్​ రికార్డులు తెప్పించి చూడాలని చెప్పారు. ‘‘ నాడు టీడీపీలో ఉన్న నేను.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై గొంతెత్తాను. కానీ, ఏనాడూ కేసీఆర్​ పార్లమెంట్​లో తెలంగాణపై మాట్లాడింది లేదు. అసెంబ్లీలో నేనెంత మాట్లాడాను.. పార్లమెంట్​లో కేసీఆర్​ ఎంత మాట్లాడారో తేలుద్దాం. అమరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే.. వారి శవాల మీద అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ వాళ్లా మమ్మల్ని ప్రశ్నించేది?’’ అని సీఎం ప్రశ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణాలు తమకు లేవని, నమ్మిన వారిని మోసం చేసే గుణం బీఆర్ఎస్ పెద్దల డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు.  

ఆడబిడ్డలను అరెస్ట్​ చేసిన పాపం ఊరికేపోదు

‘‘ఒక టీవీ చానల్​ తమకు వ్యతిరేకంగా ఉందని, ఆ చానల్​ను రాసివ్వాల్సిందిగా ఆ చానల్​ సీఈవో, లేడీ జర్నలిస్టును బీఆర్​ఎస్​ వాళ్లు నాడు బెదిరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆ లేడీ జర్నలిస్టును అరెస్ట్​ చేసి జైలుకు పంపారు. ఆ జర్నలిస్టును నెల రోజులు జైల్లో పెడితే నేను అడ్వకేట్​తో బెయిల్​ ఇప్పించాను” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 

మహిళా జర్నలిస్టును ఉత్తపుణ్యానికి అరెస్ట్​ చేసిన పాపం ఊరికే పోతుందా,  అందుకే మీ (కేసీఆర్​) ఇంట్లో ఇవాళ జైలుకు పోతున్నారని, మంది ఆడపిల్లలను జైలుకు పంపితే ఇప్పుడు అదే గతి వాళ్లకూ పడుతున్నదని పేర్కొన్నారు. ‘‘ఫామ్​హౌస్​లు కట్టుకున్నది వాళ్లు.. నియమాలు ఉల్లంఘించింది వాళ్లు. నన్ను 16 రోజులపాటు చర్లపల్లి జైలులో ఉగ్రవాదులను పెట్టే డిటెన్షన్​ సెల్​లో పెట్టారు. నేనేమీ భయపడలేదు. పోరాడాను. పదేండ్ల బీఆర్​ఎస్​ పాలన గురించి మాట్లాడుదామంటే ఆగస్టు 1, 2న సభ నడుపుకుందాం. రాత్రింబవళ్లు సభను నడుపుదాం” అని ఆయన అన్నారు.  

పదవుల కోసం కేసీఆర్​ ఊడిగం

‘‘నాడు సమైక్య రాష్ట్రంలో కడప, విజయవాడలో థర్మల్​ పవర్​ ప్లాంట్లతో కరెంట్​ను ఎగదన్నుకుపోయారు కాబట్టే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమొచ్చింది. నాడు సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్​ రాజశేఖర్​ రెడ్డితో అంటకాగి మంత్రి పదవులు అనుభవించింది కేసీఆర్​ కాదా?” అని సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. ‘‘610 జీవో వద్దని.. మేధోసంపద ఎక్కడున్నా వాడుకోవాలని చంద్రబాబుకు చెప్పింది బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ కాదా? చంద్రబాబు పంచన చేరి ఆయనతో ఇవన్నీ చేయించింది వాళ్ల (బీఆర్​ఎస్​) నాయకుడు కాదా? 

ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్న ఆయన్ను (హరీశ్​ రావును ఉద్దేశించి) వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి మంత్రిని చేయలేదా? పోతిరెడ్డిపాడుకు బొక్క పెద్దది చేసినప్పుడు కడప ఇన్​చార్జి మంత్రి (నాయిని నర్సింహారెడ్డి) వాళ్ల పార్టీ నేత కాదా? ” అని ఆయన ప్రశ్నించారు.   ‘‘మంత్రి పదవుల కోసం చంద్రబాబు, రాజశేఖర్​ రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది?’’ అని బీఆర్​ఎస్​పై ఫైర్​ అయ్యారు. 

జైపాల్​తో వివేక్, పొన్నం, రాజగోపాల్​ చర్చిస్తేనే..

‘‘ ఏ ప్రాంతంలో విద్యుత్​ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో ఆ ప్రాంతానికే ఎక్కువ విద్యుత్​ ఇచ్చే విధానం రాష్ట్రాల ఏర్పాటు చట్టంలో ఉంది. దీంతో ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్​.. విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని కామెంట్లు చేశారు. ఆ చట్టంలోని నిబంధన తెలిసి.. వెంటనే నాటి తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్​, రాజగోపాల్​ రెడ్డి, వివేక్​ వెంకటస్వామి ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్​రెడ్డి దగ్గరకు వెళ్లి కూర్చున్నరు. ఈ చట్టం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, దాన్ని మార్పించాలని కోరారు. విషయాన్ని సోనియాగాంధీ, మన్మోహన్​ సింగ్​కు జైపాల్​ చెప్పడంతో విద్యుత్​ పంపిణీకి స్పీకింగ్​ ఆర్డర్స్​ వచ్చాయి. ఈ ప్రత్యేకమైన మినహాయింపును ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చారు. ఆ ఫలితంగానే 53.46 శాతం తెలంగాణకు.. 46 శాతం ఏపీకి వెళ్లింది” అని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. 

కిషన్​రెడ్డి, కేటీఆర్​చుట్టాలైన్రు

బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నేతలు కేటీఆర్​, హరీశ్​ రావు, జగదీశ్​ రెడ్డి చుట్టాలయ్యారని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ‘‘బావబామ్మర్దులు (హరీశ్​, కేటీఆర్​) ఢిల్లీకి చీకట్లో వెళ్లి కాళ్లు పట్టుకోంగనే అందరూ చుట్టపోళ్లయ్యారు. నిజాలు చెప్తుంటే కిషన్​రెడ్డికి, వీళ్లకు ఎందుకు దు:ఖాలొస్తున్నయ్​. ఆయనను వీళ్లు.. వీళ్లను ఆయన ఓదార్చుకుంటున్నరు. బీఆర్​ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం అందరికీ తెలుసు” అని ఆయన అన్నారు.