రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్ల విషయంలో  కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎసెన్షియల్​ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్​ (ఎస్మా) ప్రయోగించాలని కలెక్టర్లను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో కావాలనే వడ్లు కొనకపో వడం, ఇన్​టైంలో ధాన్యం దింపుకోకపోవడం, మిల్లులకు నేరుగా తెచ్చిన వడ్లకు తూకాల్లో కోతలు పెట్టడం,  మద్దతు ధర ఇవ్వకపోవడం లాంటి  చర్యల తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో  సోమవారం అధికారులతో ఆయన  మాట్లాడారు. 

ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేంది లేదని సీఎం హెచ్చరించారు. రైతులను వేధిస్తున్నవాళ్లపై కఠి నంగా వ్యవహరించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా వడ్ల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తూకం, అన్​లోడింగ్ ​ప్రక్రియ ఆలస్యం కాకుండా చూసుకోవాలని చెప్పారు. గోనె సంచుల కొరత లే కుండా చూడాలని, ధాన్యం ఎప్పటికప్పుడు తరలించేందుకు వాహనాలు రెడీగా పెట్టుకోవాలన్నారు. ఎక్కడైనా జాప్యం జరిగితే అధికారులు, వ్యాపారులదే బాధ్యత అని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు.