సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ను దర్శించుకున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 2) మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాగోబా దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మోస్రా వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక దర్బార్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. నాగోబా జాతర నిర్వహణకు ఇప్పటికే నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రూ. 6 కోట్లతో నాగోబా ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయ గోపురానికి ప్రారంభోత్సవం చేశారు.
ఈ ఏడాది నాగోబా జాతర ఫిబ్రవరి 9న ప్రారంభం అవుతుంది. పుష్యమాస పౌర్ణమి నుంచి జాతర సందడి మొదలయింది. ప్రతి యేటా పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకు పవిత్ర గోదావరి నదీ జలాభిషేకతంతో జాతర ప్రారంభం అవుతుంది. మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి కలమడుగు వరకు పాదయాత్రగా వెళ్లి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేస్తారు. ఐదు రోజులు వైభవంగా జరిగే ఈ జాతరలో మూడో రోజు నిర్వహించే దర్బార్ చాలా ప్రత్యేకమైనది.