- క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రభుత్వానిదే
- మూడేండ్లకు సరిపడా నిధులు ముందే కేటాయింపు
- 15 మందితో పాలకమండలి
- రాష్ట్రమంతటా శాటిలైట్ క్యాంపస్‌లు ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ’కి చాన్స్‌లర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ 2024’ బిల్లులో పలు కీలక విషయాలను ప్రభుత్వం పొందుపరిచింది. వాస్తవానికి బిల్లులో గవర్నర్ లేదా సీఎం చాన్స్‌లర్‌గా ఉంటారని పేర్కొన్నప్పటికీ.. సభలో దాన్ని సీఎంతో సబ్‌స్టిట్యూట్ చేసింది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రభుత్వం భరించనున్నది.
దాంతో పాటు మూడేండ్లకు అవసరమయ్యే నిధులు కూడా అందుబాటులో ఉంచనున్నది. యూనివర్సిటీకి అవసరమైన పర్మినెంట్ బిల్డింగ్, క్యాంపస్ కోసం వంద ఎకరాల వరకు భూమిని ఫ్రీగా ఇస్తుంది. వర్సిటీలో భాగమయ్యే ప్రైవేట్ పార్ట్నర్.. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతను నిర్వహించాలని బిల్లులో సర్కారు నిర్దేశించింది. సంబంధిత పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నది. నిధులు, కో ఆపరేషన్, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, రిక్రూట్మెంట్ వంటి విషయాల్లో ప్రైవేటు భాగస్వామి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. మరోవైపు డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు చదివేటప్పుడే ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణను స్కిల్ యూనివర్సిటీ ద్వారా స్టూడెంట్లకు ఇప్పిస్తారు.
శాటిలైట్ క్యాంపస్‌ల బాధ్యతలన్నీ రిజిస్ట్రార్‌కే
స్కిల్ వర్సిటీకి అనుబంధంగా రాష్ట్రమంతా శాటిలైట్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్.. ఈ శాటిలైట్ క్యాంపస్‌లకు బాధ్యత వహిస్తారు. యూనివర్సిటీలో నిర్మించే ప్రతి అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్కు ఒక డీన్‌ను నియమించనున్నారు. యూనివర్సిటీకి ఓ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రభుత్వం నిబంధనను పొందుపరిచింది. ఈ ఆర్థిక సంఘం కార్యనిర్వాహక మండలికి ఉప సంఘంగా ఉండనున్నది. ఈ ఆర్థిక సంఘానికి యూనివర్సిటీ వీసీ చైర్‌పర్సన్‌గా ఉంటారు.
కార్యనిర్వాహక మండలి ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తుంది. దాంతో పాటు బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్‌కు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ఆర్థిక శాఖ అధికారి సంఘానికి కార్యదర్శిగా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటున్న సంస్థలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అప్పులు తీసుకునేందుకు వీలు కల్పించారు.
ఒక్కో డీన్ పదవీ కాలం రెండేండ్లు
యూనివర్సిటీ పాలకమండలిని 15 మంది సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. ఒక చైర్పర్సన్, వైస్‌చాన్స్‌లర్, యూనివర్సిటీ అనుబంధ శాటిలైట్ సెంటర్ల నుంచి ఇద్దరు డీన్లు (వంతుల వారీగా.. ఒక్కో డీన్‌కు రెండేండ్ల పదవీ కాలం), ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల కార్యదర్శులు ఉంటారు. అదేవిధంగా, చాన్స్‌లర్ నామినేట్ చేసే ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌ను మానిటర్ చేసే అధికారి, ప్రైవేట్ పార్ట్నర్, యూనివర్సిటీ స్పాన్సర్లు, ప్రోగ్రామ్స్‌ను అమలు చేసే ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ నిపుణుల నుంచి ఏడుగురిని పాలక మండలిలో నియమించేలా బిల్లులో పొందుపరిచారు.
పాలకమండలి చైర్పర్సన్ పదవీకాలాన్ని మూడేండ్లుగా నిర్ధారించారు. బోర్డుకు చైర్‌పర్సన్‌ను చాన్స్‌లర్ నామినేట్ చేస్తారు. అందుకు సెర్చ్కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. బోర్డులోని సభ్యుల పదవీ కాలం మూడేండ్ల పాటు ఉంటుంది. సభ్యులు దానికి అదనంగా మరో మూడేండ్ల పాటు ఉండేలా కూడా బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది. వివిధ రంగాల నుంచి ఎన్నుకున్న సభ్యుల పదవీ కాలం మాత్రం రెండేండ్ల పాటు ఉంటుంది. పాలకమండలిలోనూ మహిళలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని బిల్లులో సూచించారు. పాలకమండలితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (కార్యనిర్వాహక మండలి)ని యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి వీసీ చైర్‌పర్సన్‌గా ఉంటారు. రెక్టార్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల కార్యదర్శులను సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.