బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18ఏండ్ల కల నెరవేరబోతోంది : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో  18ఏండ్ల కల నెరవేరబోతోంది : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • డిసెంబర్ 7న  కెనాల్స్, మెడికల్ కళాశాల  ప్రారంభించనున్న సీఎం
  • జిల్లాలో  ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం

నల్గొండ, వెలుగు: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో  ప్రజల 18 ఏండ్ల కల నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్​లో పూలే  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 7న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, నల్గొండలోని మెడికల్ కళాశాలను  సీఎం   ప్రారంభిస్తున్నట్టు  తెలిపారు. అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ  ఉంటుందన్నారు.

   నల్గొండ పట్టణంలో రూ.110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్​తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, రూ.275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం  ప్రారంభిస్తారని తెలిపారు.   పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయానికి శంకుస్థాపన   చేస్తారని తెలిపారు.  బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నింపామని, ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాల్లో  భూగర్భ జలాలు పెరగడంతో పాటు   ఆయకట్టు పెరుగుతుందన్నారు.   ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల కోరిక  నెరవేరబోతుందని అన్నారు.

Also Read :- డిసెంబర్ నెలలో.. గోదావరి సెకండ్​ ఫేజ్​

 రైతు రుణమాఫీని  పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. వీటితో పాటు రూ.100 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్డులకు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్టిమేట్ వేయడం జరిగిందని వెల్లడించారు. వీలైతే వీటిని  సీఎంతో శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు, ఎంపీ,ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని  పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మూసీతో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాలయ్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు. మూసి ప్రక్షాళనతో న్యాయం  చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించి రెండు మిషన్లు త్వరలో జిల్లాకు చేరుకుంటాయని, 20 నెలల్లోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని అన్నారు. 

రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత  కాంగ్రెస్​ ప్రభుత్వానిదే

దేశంలో ఎక్కడలేని విధంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తమ  ప్రభుత్వానిదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.  200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.నెలకు రూ.300 కోట్లను భరిస్తూ మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు బీజేపీ  అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు.గత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేయగా వాటిని భరిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతున్నదన్నారు. 

 రూ. 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు

రూ .30 వేల కోట్లతో చేపట్టబోయే రీజినల్ రింగ్ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీ ని కలిసి ఆహ్వానిస్తామన్నారు.  అభివృద్ధి, నిధుల కోసం కేంద్ర మంత్రులను  కలుస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్- విజయవాడ రోడ్డును కేంద్రమంత్రి గట్కరితో చర్చించి ఫైనల్ చేయడం జరుగుతుందన్నారు. నల్గొండ రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు పిలిచామని , అవి కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో  నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేశ్​ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్​, నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కనగల్ మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.