ఖమ్మం, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయనున్నారు. దీని ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి. పంప్ హౌస్ ప్రారంభోత్సవం తర్వాత ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
అదే సభలో తుది విడత రుణమాఫీకి నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు 15 కల్లా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీ మేరకు.. బహిరంగ సభలో కొందరు రైతులకు చెక్కులు అందించడంతో పాటు మిగతా రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.
ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగానే గోదావరి పారుతున్నా, ఖమ్మం జిల్లాకు మాత్రం నీరందే పరిస్థితి లేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.2,800 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టుగా దాన్ని రీడిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.18వేల కోట్లకు పెంచారు. 2016లో శంకుస్థాపన చేసిన తర్వాత ఏడేండ్లలో రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు.
మట్టి పనులు కంప్లీట్ చేసి కాల్వలను తవ్వినా.. మధ్యలో వాగులు, రోడ్లు అడ్డం వచ్చిన చోట బ్రిడ్జిలు, ఆక్విడెక్ట్ లు, టన్నెల్స్ వంటి సిమెంట్ నిర్మాణాలను మాత్రం పట్టించుకోలేదు. నాలుగేండ్ల క్రితమే పంప్ హౌస్ లలో మోటార్లను బిగించినా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. 155 చోట్ల స్ట్రక్చర్లను పెండింగ్ పెట్టారు. ఇక ఫీడర్ చానళ్లు, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థలను కూడా లైట్ తీసుకున్నారు.
మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే స్ట్రక్చర్లు, టన్నెళ్ల నిర్మాణంతో పాటు ఇంకా రూ.10 వేల కోట్లు అవసరం కానున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పూర్తయిన పనులను సద్వినియోగం చేసుకుంటూ, రైతులకు నీళ్లందేలా నిర్ణయాలు తీసుకున్నారు. రూ.90 కోట్లతో ఏన్కూరు లింక్ కెనాల్ ను నిర్మించడం ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు చేరేలా ప్లాన్ చేశారు. దీంతో తొలి విడతలోనే లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీళ్లందనున్నాయి.
950 మందితో బందోబస్తు..
వైరాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. వైరాలోని ఫంక్షన్ హల్ లో నిర్వహించిన సమావేశంలో భద్రత ఏర్పాట్లపై సిబ్బందికి పోలీస్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన సజావుగా సాగేలా 950 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించారు.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇదీ..
సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంప్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత.. పంపు హౌస్ స్విచ్చాన్ చేస్తారు. అదే సమయంలో కమలాపురం పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో వైరా చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో చివరి విడత రుణమాఫీని ప్రారంభిస్తారు.