హైదరాబాద్, వెలుగు: ఇటీవల ప్రమోషన్ పొందిన సుమారు 30వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సోమవారం సీఎస్ శాంతికుమారి సంబంధింత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీచర్లకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించినట్టు గుర్తుచేశారు. ఈ ప్రమోషన్లు పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు 2న ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
అయితే, ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందికి రైన్ ప్రూఫ్ టెంట్ సౌకర్యం కల్పించాలని, జిల్లాల నుంచి వచ్చే టీచర్లకు తగు పార్కింగ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం దగ్గర తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలనూ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ జితేందర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎస్సీ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.