రవీంధ్ర భారతిలో జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ జర్నలిస్టు సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిస్థలాలను మంజూరు చేశారు. 1105 మందికి ఇండ్ల స్థలాలు పట్టాలను ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పోరాడిన జర్నలిస్టుల కల నెరవేరింది. ఇల్లు అనేది పెద్ద కల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు పూర్తిగా స్వేచ్చ ఇస్తున్నామన్నారు. సొసైటీ సభ్యులకు భూమి స్వాధీన పత్రాన్ని అందజేశారు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. 1100 మంది జర్నలిస్టులకు ఈ రోజు పండగ రోజుని అన్నారు. సమస్యను పరిష్కరించే వారు బాధ్యతగా ఉండాలని అన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కారం చేశామన్నారు.
జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లు అని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. ఈ వ్యవస్థలపై నమ్మకం పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలగా వ్యవహరించవద్దన్నారు. కొన్ని రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతున్నాయన్నారు. సిద్దాంతాలను ప్రచారం చేసుకొనే పత్రికలు ఎక్కువయ్యాయన్నారు. కొంతమంది అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. కొంతమంది ఏది పడితే అది మాడ్లాడుతున్నారంటూ.. ఇలాంటి విధానానికి మీరే పరిష్కారం చూపాలన్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికి న్యాయం చేస్తామన్నారు. అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. జర్నలిస్టులు సమస్యలు సృష్టించవద్దన్నారు .అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారని అన్నారు. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రస్తుతం ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారన్నారు. ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్యసదుపాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కొంతమంది చిట్ చాట్లను కూడా బదనాం చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో ఏ వ్యవస్థకు పాలసీ లేదన్నారు. చిన్న, పెద్ద పత్రికలను ఎలా గుర్తించాలో ఒక నివేదకను తయారు చేయాలన్నారు. ప్రెస్ అకాడమీకి స్పెషల్ ఫండ్ కింద రూ. 10 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కమిటీ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఐఎంపీఆర్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.