- ఎల్బీ స్టేడియంలో చిల్డ్రెన్స్డేతో ప్రారంభ సభ.. పాల్గొననున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రారంభ సభను నిర్వహించనున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అటెండ్ కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తరువాత 3 గంటలకు ఎస్సీఈఆర్టీ ఆఫీస్ ప్రాంగణంలో చిల్డ్రెన్స్ మాక్ అసెంబ్లీలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుని..ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా విద్యా శాఖ నిర్వహించే చిల్డ్రెన్స్డే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
దాదాపు 14 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే ఈ సమావేశంలో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బదులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని, భద్రతకు ప్రాధాన్యం నివ్వాలని సూచించారు. కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.