- నేటి నుంచి ‘బీఎఫ్ఎస్ఐ’మినీ డిగ్రీ కోర్సు షురూ
- ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఈ ఏడాది 38 కాలేజీల్లో10 వేల మంది స్టూడెంట్ల ఎంపిక
- కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన స్టూడెంట్లకు రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బీఎఫ్ఎస్ఐ కోర్సులను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రారంభించనున్నారు.
ఈ మినీ డిగ్రీ కోర్సును ఈ ఏడాది కేవలం ఎంపిక చేసిన కాలేజీల్లోనే స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మొత్తం 38 కాలేజీలు గుర్తించింది. దీనిలో18 ఇంజినీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10 వేల మంది స్టూడెంట్లకు ఈ శిక్షణను
అందించనున్నారు.
ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పోర్టల్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు బీఎఫ్ఎస్ఐ కోర్సు ఉపయోగపడనుంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఈ ప్రోగ్రాంలో శిక్షణను అందుకునే 10 వేల మంది స్టూడెంట్ల వివరాలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ను రూపొందిస్తున్నది.
దీంట్లో స్టూడెంట్ల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన వారిని జాబ్స్‌కు ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేస్తుంది. ఫలితంగా బీఎఫ్ఎస్ఐ శిక్షణ పొందేవాళ్లకు ఇటు చదువుతోపాటు అటు ఉద్యోగ భరోసా దక్కనుంది.
ఈ ప్రోగ్రామ్ కోసం సీఎస్ఆర్ నిధులను సమీకరించి మూడేండ్ల పాటు శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు బీఎఫ్ఎస్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఎక్విప్(ఈక్యూయూఐపీపీపీ) అనే సంస్థ ఈ ప్రోగ్రామ్‌కు రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది.