జూన్ 2న జయ జయహే ఒక్కటే

జూన్ 2న జయ జయహే ఒక్కటే

రాష్ట్ర ముద్రపై ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలన్నదానిపైనా చర్చకు పెట్టనున్న సర్కారు
ఆ తర్వాతే ఫైనల్ చేయాలని నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర లోగోలో మార్పులపై ఇంకా విస్తృతంగా అభిప్రాయాలు సేకరించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. రాచరికపు ఆనవాళ్లు లేకుండా పోరాటాలకు, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా రాష్ట్ర ముద్రను తీర్చిదిద్దాలని భావించారు.

ఈ మేరకు రుద్ర రాజేశానికి బాధ్యతలు  అప్పగించారు. ఆయన పలు మోడళ్లను రూపొందించి సీఎం ముందుంచారు. వాటిని మంత్రులు, అలనాటి జేఏసీ చైర్మన్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం తో కూడిన ఓ లోగో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే ఫైనల్ అని.. కాసేపట్లో ప్రకటన వస్తుందని ప్రచారం జరిగింది.

లోగోలో ఏమేం ఉండాలన్న అంశంపై విస్తృతంగా చర్చకు పెట్టి ప్రజాభిప్రాయం మేరకే  మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున జూన్ 2వ తేదీన పరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమంలో లోగో ఆవిష్కరణ ఉండదని సీఎంవో వర్గాలు తెలిపాయి. అలాగే రాచరికపు ఆనవాళ్లు లేకుండా తీర్చిదిద్దాలని భావించిన తెలంగాణ తల్లి విగ్రహంపైనా విస్తృతంగా చర్చ జరగాలని, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఆ రోజు ఉండే అవకాశం లేదు. 

ప్రజాభిప్రాయానికే పెద్దపీట

లోగో, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృతంగా చర్చించాలని భావిస్తోంది. విభిన్న వర్గాల అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ నిర్ణయాన్నే అమలు చేయాలనుకుంటోంది. లోగో, తెలంగాణ తల్లి చిరకాలం నిలిచిపోయేలా.. సబ్బండ వర్ణాల ఆమోద ముద్ర వేసుకున్నవిగా ఉండాలనే ఉద్దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎంవో వర్గాలు తెలిపాయి.