మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సారి ఎందుకంటే..?

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సారి ఎందుకంటే..?

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లున్నారు. శనివారం (ఫిబ్రవరి 1) రాత్రి లేదా ఆదివారం (ఫిబ్రవరి 2) ఉదయం ఆయన హస్తినాకు వెళ్లే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ఆయన క్యాంపెయినింగ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. 

ఇప్పటికే ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి హస్తినాలో పర్యటించారు. లాస్ట్ టూర్‎లో భాగంగా.. కాంగ్రెస్ గ్యారెంటీలను లాంఛ్ చేశారు. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే సెగ్మెంట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే.. కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పలువురు కేంద్రమంత్రులను కలిసి చర్చించనున్నట్లు తెలిసింది..

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 70 స్థానాలకు సింగల్ ఫేజ్‎లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రెండు  పర్యాయాలుగా తిరుగులేని విజయం సాధించిన ఆప్.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

ALSO READ | అడిగిందేమిటి.. ఇచ్చిందేంది?: కేంద్ర బడ్జెట్ పై సీఎం అసంతృప్తి

ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైన దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో వరుసగా దశాబ్ధం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. హస్తినాలో తిరిగి పునర్వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఆప్, కాంగ్రెస్, బీజేపీల ట్రయాంగిల్ పోరుతో ఢిల్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరీ ఢిల్లీలో ఈ సారి ఏ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు ఆగాల్సిందే.