కల్వకుర్తి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 28న కల్వకుర్తిలో పర్యటించనున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కల్వకుర్తి తహసీల్దార్ ఆఫీస్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తో కలిసి సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ సీతారామారావు పాల్గొన్నారు.
విగ్రహ ఏర్పాటు పనులు పరిశీలించిన మంత్రి
మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వెల్దండ మాజీ సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్య వైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, పార్టీ నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్, చిన్న జంగయ్య యాదవ్, వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.