హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండవ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లిన సీఎం.. అక్కడి నుండి ఇవాళ (మంగళవారం) మహబూబాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మహబూబాబాద్‌కు వెళ్లే ముందు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు వెళ్లి వరద ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
కాగా, గంగారం తండాకు చెందిన లూనావత్ అశ్విని వ్యవసాయ సైంటిస్టుగా ఛతీస్ఘడ్లోని రాయపూర్‌లో పనిచేస్తుంది. సెలవుపై తన సొంత గ్రామమైన గంగారం తండాకు తన సోదరుడి వివాహ ఎంగేజ్మెంట్కు వచ్చిన అశ్విని.. మూడు రోజుల క్రితం రాయపూర్ వెళ్లేందుకు తన తండ్రి మోతిలాల్‌తో కలిసి రాయపూర్ వెళ్లేందుకు బయలుదేరారు. మహబూబాద్ దాటిన తర్వాత పురుషోత్తయ్య గూడెం వద్ద భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాగు దాటుతుండగా వారు ప్రయాణిస్తో్న్న కారు వాగులో గల్లంతైంది.
రెండు గంటల వ్యవధిలో అశ్విని శవం దొరకగా, ఆమె తండ్రి మోతిలాల్ మృతదేహం నిన్న పురుషోత్తయ్య గూడెం ఓ పొలంలో లభ్యమయింది. సోమవారం సాయంత్రం వీరి అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గంగారం తండ లోని అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడి నుండి నేరుగా వర్షం, వరదలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లను పరిశీలించనున్నారు.