రేపు యాదాద్రికి రేవంత్.. సీఎం హోదాలో తొలిసారి

సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11 సోమవారం రోజున యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎంతో పాటుగా ఆరుగురు మంత్రులు కూడా యాదాద్రికి వెళ్లనున్నారు.   బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వస్తి పూజలలో సీఎం, మంత్రలు పాల్గొననున్నారు.  స్వామి వారి  దర్శనం అనంతరం యాదాద్రి నుండి నేరుగా భద్రాచలం  వెళ్లనున్నారు.  సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి రేవంత్ యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. 

రేపటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.  సోమవారం విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యే ఉత్సవాలు ఈ నెల 21న  శృంగార డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకల్యాణ మహోత్సవం, 19న  దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 

కాగా, 11 రోజుల పాటు  ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.