
- రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానున్నందున.. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు.
ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణ అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.