హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఇవాళ (సెప్టెంబర్ 7) తొలి పూజ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని కోరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా ఈ ఏడాది గణేష్ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఖైరతాబాద్ బడా గణేష్ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడికి 70 ఏళ్ల సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో విగ్రహాం నిర్మించారు.