కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ  లేఖ
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ  లేఖ

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో  చెప్పాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్​ రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖను రాశారు. గతంలో రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్​లో ప్రాతినిధ్యం వహించిన  జైపాల్ రెడ్డి, కాకా వెంకటస్వామి  వంటి వారు హైదరాబాద్ మెట్రో రైల్, సింగరేణి కార్మికులకు పింఛన్​లాంటి సౌకర్యాలను కల్పించి.. తమదైన ముద్రవేశారని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్​లో ఉన్న మీరు తెలంగాణకు చేసిందేమిటో ప్రజలకు తెలపండి” అని కిషన్​రెడ్డి కోరారు. 

2019 నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టుకూ అనుమ‌‌తిని, నిధుల మంజూరును సాధించ‌‌లేక‌‌పోయారని విమర్శించారు. ‘‘2019 నుంచి కేంద్ర కేబినెట్​లో తెలంగాణ నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత. ఇదే విషయాన్ని నేను బహిరంగంగానే పలుమార్లు ప్రకటించా. మీరు కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూర్​కు మెట్రో విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అదే హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఏడాదిగా మేం విజ్ఞప్తి చేసినా, మిమ్మల్ని కలిసి విన్నవించినా పట్టించుకోలేదు. 

నార్త్​ ఇండియాలోని నదులపై పత్రికల్లో వ్యాసాలు రాసిన మీరు.. తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవంపై విషం చిమ్ముతున్నారు. ట్రిపుల్​ఆర్​  డ్రైపోర్ట్ మంజూరు విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే సీఎం అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని, మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా? అంటూ విమర్శలు చేస్తున్నారు.  తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మేం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు ఏ విధంగా చేయూతనిస్తారో చెబితే ప్రజలు సంతోషిస్తారు. అంతేగానీ కేంద్రమంత్రిగా ఉండి ఏ ఒక్కటీ సాధించలేని మీరు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదు”అని  సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.