హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం(నవంబర్ 8, 2024) యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హెలికాఫ్టర్లో బేగం పేట విమానాశ్రయం నుంచి యాదాద్రికి సీఎం బయల్దేరుతారు. 9.20 నిమిషాలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. 10.05 నుంచి 11.15 మధ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు YTDA, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం స్వయంగా సమీక్షించనున్నారు.
మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి రూ. 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన పైలాన్ను యాదగిరిగుట్టలో ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 మధ్యలో మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో సంగెం గ్రామం చేరుకుంటారు.
మధ్యాహ్నం 2.10కి సంగెం గ్రామానికి సీఎం వెళతారు. 2.10 నుంచి 3 గంటల వరకూ వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు ‘మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర’ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు. మూసీ పునరుజ్జీవం ఎంత ఆవశ్యకమో చెప్పేందుకు వాడపల్లి నుంచి తాను పాదయాత్ర చేస్తానని, నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా? లేదా? అని వారినే అడిగి తెలుసుకునేందుకు తనతో కలిసి కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ నడుస్తారా? అని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.